NTV Telugu Site icon

Nagoba Jatara: ఘనంగా నాగోబా విగ్రహ ప్రతిష్ట.. తరలివచ్చిన మెస్రం వంశీయులు

Nagoba

Nagoba

Nagoba Jatara: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో నూతనంగా నిర్మించిన ఆలయంలో నాగోబా విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ చేశారు. ఆదివారం ఉదయం మెస్రం వాసులు నాగోబా విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్ఠించారు. అనంతరం తమ ఆరాధ్య దైవానికి ప్రత్యేక పూజలు చేశారు. ఉమ్మడి జిల్లాల నుంచి వేలాదిగా తరలివచ్చిన ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ జెడ్పీ చైర్మన్ మెస్రం వంశీయులు, ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పాల్గొన్నారు. మెస్రం వాసులు తొలినాళ్లలో నాగోబా దేవి దర్శనమిచ్చిన పుణ్యక్షేత్రాన్ని (పుట్ట) మాత్రమే పూజించేవారు. 1956లో గడ్డి కప్పులతో చిన్న గుడిసె నిర్మించి పూజలు చేశారు. అనంతరం 1995లో సిమెంటు, ఇటుకలతో చిన్నపాటి గుడి నిర్మించి పూజలు చేశారు. ప్రభుత్వ సహకారంతో 2000 సంవత్సరంలో ఆలయాన్ని నిర్మించారు. ప్రస్తుతం శిలలతో కొత్త ఆలయాన్ని నిర్మించారు. పుష్య మాసంలో మెస్రం కులస్తులు నిర్వహించే నాగోబా జాతర రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద గిరిజన జాతర.

మెస్రం వంశస్థులు 1956లో చిన్న దేవాలయాన్ని నిర్మించి నాగోబా జాతర నిర్వహించారు. మెస్రం కులస్తుల వినతి మేరకు అప్పటి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జి.నగేష్ రూ.3.80 లక్షలతో గర్భాలయం, సతీదేవత దేవాలయంతో పాటు నాగోబా ఆలయ నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. మెస్రం ప్రజలు 2018 వరకు నాగోబా జాతరను అత్యంత వైభవంగా నిర్వహించారు. జాతర సందర్భంగా భక్తులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మెస్రం వంశస్థులు నూతనంగా నాగోబా ఆలయాన్ని నిర్మించారు. నాగోబా విగ్రహ పునఃప్రతిష్ఠాపనకు హాజరుకావాలని ఆలయ ప్రారంభోత్సవానికి మెస్రం వంశీయులు, ఎమ్మెల్యే రేఖానాయక్‌తో పాటు మంత్రి కేటీఆర్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించిన సంగతి తెలిసిందే.. కానీ మంత్రి కేటీఆర్ మాత్రం ఈకార్యక్రమానికి హాజరుకాలేదు.

Show comments