మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఇవాళ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. మంత్రి కేటీఆర్ మానుకోటలో పోడు రైతులకు పట్టాలు పంపిణీతో పాటు పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని జిల్లాలోని 24,181మంది పోడు రైతులకు 67,730ఎకరాల పోడు పట్టాలను ఆయన అందించనున్నారు. మహబూబాబాద్ పట్టణంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి సత్యవతిరాథోడ్, జిల్లా కలెక్టర్ శశాంక, ఎస్పీ శరత్ చంద్రపవార్ తో కలిసి పనులు పరిశీలించారు.
Read Also: Astrology : జూన్ 30, శుక్రవారం దినఫలాలు
రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నేడు రోడ్డు మార్గం ద్వారా మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. కాసేపట్లో హైదరాబాద్ నుంచి మంత్రి కేటీఆర్ బయలుదేరి ఉదయం 10:30 గంటలకు మహబూబాబాద్‌కు చేరుకుని.. జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ ఆఫీస్ వద్ద ఎస్‌డీఎఫ్ నిధులు రూ.50కోట్లతో మునిసిపాలిటీలో చేపట్టనున్న అభివృద్ధి పనుల పైలాన్‌ను ఆవిష్కరించనున్నారు.
మహబూబాబాద్ పట్టణంలో కోటి రూపాయలతో నిర్మించిన వైకుంఠధామంతో పాటు.. రూ.5కోట్లతో నిర్మించనున్న వివేకానందసెంటర్ నుంచి ఈదులపూసపల్లి వరకు రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్‌కు సంబంధించిన పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 11 గంటలకు రూ.5 కోట్లతో నిర్మించిన ఇంటిగ్రెటెడ్ మోడల్ మార్కెట్‌ను కేటీఆర్ ఓపెనింగ్ చేయనున్నారు. 11:15 గంటలకు రామచంద్రపురం కాలనీలో పూర్తైన 200 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి నేరుగా ఎన్టీఆర్ స్టేడియానికి 11:30 గంటలకు చేరుకుని పోడు రైతులకు పట్టాలను పంపిణీ చేసి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. పోడు రైతులతో కలిసి కేటీఆర్ భోజనం చేయనున్నారు. మధ్యాహ్నం 2:30 గంటలకు తిరిగి మానుకోట నుంచి హైదరాబాద్‌కు బయలు దేరి రానున్నారు.
