NTV Telugu Site icon

కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపిన కేటీఆర్.. 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే..

KTR

KTR

తెలంగాణలో జోనల్‌ వ్యవస్థలో మార్పులకు ఈ ఏడాది ఏప్రిల్‌ 19న రాష్ట్రపతి ఆమోదం తెలియజేయగా.. కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ కూడా ఇచ్చేసింది.. తద్వారా జోనల్‌ వ్యవస్థ పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చేసింది.. ఇప్పటి వరకు ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయినందున ఉద్యోగ నియామకాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాలకు ప్రభుత్వం ఈ కొత్త జోనల్‌ విధానం వర్తింపజేయనుంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అన్ని ప్రాంతాలకు సమాన అవకాశాలకు తోడు స్థానికులకు ప్రయోజనాలు కల్పించేందుకు ప్రభుత్వం జోనల్‌ వ్యవస్థలో మార్పులుచేసింది. గతంలో ఉన్న రెండు జోన్లను ఏడు చేసింది. కొత్తగా రెండు బహుళ జోన్లను ఏర్పాటు చేసింది. మొదటి నాలుగు జోన్లను ఒక బహుళ జోన్‌లో, మిగిలిన మూడు జోన్లను రెండో బహుళ జోన్‌లో చేర్చింది… దీనిపై సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు మంత్రి కేటీఆర్.. నూతన జోనల్ వ్యవస్థ ఆమోదంతో స్థానికులకే ఉద్యోగాలన్న ఆయన.. నూతన జోనల్ వ్యవస్థను ఆమోదించిన సీఎంకి, ప్రభుత్వానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు ఎలాంటి వివక్ష లేకుండా సమాన అవకాశాలు దక్కుతాయన్న ఆయన.. ప్రభుత్వ ఉద్యోగాల్లో 95 శాతం స్థానికులకే అవకాశాలు ఉంటాయన్నారు.. మరోవైపు ప్రైవేటు రంగంలోనూ స్థానికులకు ఉద్యోగాలు ఇస్తే ప్రత్యేక రాయితీలు ఇచ్చేందుకు ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాన్ని గుర్తుచేశారు.. ప్రభుత్వ, ప్రైవేటు రంగం రెండిటిలో స్థానికులకే సింహభాగం ఉద్యోగాలు దక్కాలన్న స్ఫూర్తితో పనిచేస్తున్నామని వెల్లడించారు మంత్రి కేటీఆర్.