Site icon NTV Telugu

Minister KTR: కేంద్రం ఎన్ని కుట్రలు పన్నినా.. తెలంగాణ అభివృద్ధిని ఆపలేరు

Ktr On Central

Ktr On Central

Minister KTR Satirical Tweets On Central Government: ఫార్మా & వ్యాక్సిన్ క్యాపిటల్ అయినప్పటికీ.. తెలంగాణకు డ్రగ్ పార్క్‌ను కేటాయించలేదని మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన ట్వీట్‌పై మంత్రి కేటీఆర్ వరుస ట్వీట్లు చేశారు. కేంద్రం చూపిస్తున్న వివక్షను ఎండగట్టారు. కేంద్రం ఎన్ని కుట్రలు పన్నినా, తెలంగాణ ప్రగతి చక్రానికి ఎన్ని ఆటంకాలు కలిగించినా.. అభివృద్ధి దిశగా రాష్ట్ర పయనాన్ని మాత్రం అడ్డుకోలేదని అన్నారు. కేంద్రం స‌హ‌కారం అందించకపోయినా, తెలంగాణను ఉన్నతంగా నిలిపే దిశ‌గా టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని తెలిపారు. తెలంగాణ అభివృద్ధిలో ఎదుర‌య్యే అడ్డంకుల‌ను అధిగ‌మించ‌డంతో పాటు కలల్ని సాకారం చేసుకునే సత్తా తమకు ఉందన్నారు.

ఐటీఐఆర్‌ ప్రాజెక్ట్‌ను కేంద్రం రద్దు చేసినా, గత ఎనిమిదేళ్లలో తెలంగాణ ఐటీ రంగం 3.2 రెట్లు వృద్ధి చెందిందని కేటీఆర్ పేర్కొన్నారు. దేశంలోని ఐటీ రంగంలో వస్తున్న ప్రతీ మూడు ఉద్యోగాల్లో ఒకటి హైదరాబాద్‌లోనే వచ్చిందన్నారు. తమకు సకాలంలో నిధులు ఇవ్వకపోయినా, ఎఫ్ఆర్బీఎం ఆంక్షలు విధించినా.. జీడీపీలో తెలంగాణ వాటా ఐదు శాతంగా ఉందని తెలిపారు. ఎనిమిదేళ్లలో తెలంగాణ తలసరి ఆదాయం కూడా రెట్టింపు అయ్యిందన్నారు. పారిశ్రామిక కారిడార్లు తిరస్కరించినా, రాష్ట్రంలో అద్భుతమైన వృద్ధి నమోదైందన్నారు. 20 వేల పారిశ్రామిక మంజూరుతో పాటు 16 లక్షల మందికి కొత్త ఉద్యోగాలు లభించాయని చెప్పారు. తెలంగాణకు బల్క్ డ్రగ్ పార్క్ ఇవ్వకపోయినా.. ప్రపంచంలోనే అతి పెద్ద ఫార్మా సిటీని ఏర్పాటు చేసుకున్నామ‌న్నారు.

మిషన్ భగీరథకు నిధులు ఇవ్వకున్నా, 20 వేల చెరువులు పునరుద్ధరించామని.. ఒక్క మెడికల్ కళాశాల ఇవ్వకపోయినా, జిల్లాకు ఒకటి చొప్పున 33 వైద్య కళాశాలలు నిర్మిస్తున్నామని కేటీఆర్ వెల్లడించారు. జాతీయ హోదా ఇవ్వకపోయినా.. ప్రపంచంలోనే పెద్దదైన కాళేశ్వరం ప్రాజెక్టును సొంతంగా నిర్మించుకున్నామన్నారు. కేంద్రం మద్దతు ఉన్నా, లేకపోయినా.. పెండింగ్‌లో ఉన్న నీటి పారుదల ప్రాజెక్టుల్ని పూర్తి చేసి తీరుతామని బల్లగుద్ది చెప్పారు. మిషన్ భగీరథకు సాయం అందించకపోయినా.. ప్రతీ ఇంటికి నల్లా నీరు ఇస్తున్న మొదటి రాష్ట్రంగా దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందని కేటీఆర్ చెప్పారు.

Exit mobile version