Site icon NTV Telugu

Minister KTR: సింగరేణి బొగ్గు గనుల వేలం ప్రకటనపై కేటీఆర్ ఫైర్

Ktr Fire On Singareni Priva

Ktr Fire On Singareni Priva

Minister KTR Fires On Singareni Privatization: సింగరేణి బొగ్గు గనుల వేలం ప్రకటనపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సింగరేణిని ప్రైవేటీకరించమంటూ ప్రధాని నరేంద్ర మోడీ కల్లబొల్లి మాటలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు బొగ్గు గనులను వేలం వేస్తున్నట్లు లోక్ సభలో కేంద్రం ప్రకటించిందన్నారు. సింగరేణిని ప్రైవేటీకరించడం అంటే.. తెలంగాణ రాష్ట్రాన్ని కుప్పకూల్చడమే అభిప్రాయపడ్డారు. తెలంగాణ అభివృద్ధిపై అసూయతోనే.. ఇక్కడి విజయ ప్రస్థానాన్ని దెబ్బ కొట్టాలన్న కుట్రతో సింగరేణిని కేంద్రం ప్రైవేటీకరిస్తోందని ఆరోపించారు. తెలంగాణతో పాటు దక్షిణాది థర్మల్ విద్యుత్ ఉత్పత్తిలో సింగరేణిదే కీలక పాత్ర అని.. గనులు కేటాయించకుండా వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను దివాలా తీయించిన విధంగానే సింగరేణిపై కేంద్రం కుట్ర చేస్తోందని విమర్శించారు. అటు ఉత్పత్తిలోనూ, లాభాల్లోనూ, పిఎల్ఎఫ్‌లోనూ సింగరేణి రికార్డ్ సృష్టిస్తోందని.. అలాంటి సింగరేణిని ప్రైవేటీకరించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.

సింగరేణికి బొగ్గు గనులు కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థనను కేంద్రం పట్టించుకోలేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తన సొంత రాష్ట్రం గుజరాత్‌కి మాత్రం మోడీ గనులు కేటాయించుకున్నారని పేర్కొంటూ.. గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కి కేటాయించిన గనుల తాలూకు పత్రాలను కేటీఆర్ విడుదల చేశారు. ‘‘సొంత రాష్ట్రం గుజరాత్‌కి ఒక నీతి, తెలంగాణకి మరొక నీతిని అమలు చేస్తున్నారా? దీనిపై మోడీ స్పష్టత ఇవ్వాలి’’ అని నిలదీశారు. తెలంగాణ పట్ల ఈ పక్షపాతం ఇంకెన్ని రోజులు? అని ప్రశ్నించారు. ఇది ఒక్క సింగరేణి కార్మికుల సమస్య కాదని.. సమస్త తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించిన అంశమని కేటీఆర్ అన్నారు. సింగరేణి తెలంగాణ ఆర్థిక సామాజిక జీవనాడి అని.. సింగరేణి ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గకుంటే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ సింగరేణి ప్రైవేటీకరణ కుట్రలపై.. పార్టీలకు అతీతంగా రాష్ట్ర ఎంపీలు పార్లమెంటులో గళమెత్తాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

Exit mobile version