NTV Telugu Site icon

Jagadish Reddy: కేసీఆర్ జేబులు నింపితే.. మోడీ చిల్లులు పెట్టారు

Jagadish Reddy On Modi

Jagadish Reddy On Modi

Minister Jagadish Reddy Fires On Narendra Modi: టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా నల్లగొండ జిల్లా మర్రిగూడెం మండలం శివన్నగూడెంలో నిర్వహించిన మునుగోడు ఉప ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ వల్లే మునుగోడు నియోజకవర్గంలో ఫ్లోరైడ్ విముక్తి కలిగిందని అన్నారు. శివన్నగూడెం భూ నిర్వాసితులకు సంపూర్ణ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. రాజగోపాల్ రెడ్డి రాజకీయ స్వార్థం కోసం ఈ మునుగోడు ఉప ఎన్నిక వచ్చిందని విమర్శించారు. కేసీఆర్ జేబులు నింపుతుంటే.. ప్రధాని మోడీ, అమిత్ షాలు చిల్లలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీకి ఓటు వేస్తే.. ధరలు పెంచమని మనమే బాండ్ రాసిచ్చినట్లు అవుతుందన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి.. కోట్ల కోసం కోవర్ట్‌లుగా మారిన కోమటి రెడ్డి సోదరులను రాజకీయంగా బొంద పెట్టాలని అన్నారు.

అంతకుముందు.. ఒక వ్యక్తి కుటుంబ ప్రయోజానాల కోసమే ఈ ఉప ఎన్నికను ప్రజలపై బలవంతంగా రుద్దుతున్నారని జగదీశ్ రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోవడంతో అభివృద్ధి చేయలేకపోయానంటూ బీరాలు పలుకుతున్న రాజగోపాల్ రెడ్డి.. 18,000 కోట్ల కాంట్రాక్టు కోసమే బీజేపీలోకి చేరి, ఆ పార్టీ కుతంత్రాలలో భాగంగా ఈ ఎన్నికలు తెచ్చారని విరుచుకుపడ్డారు. నాలుగేళ్ల నుంచి అభివృద్ధి చేయని రాజగోపాల్ రెడ్డి.. ఈ ఒక్క సంవత్సరంలో ఎలా చేయగలుగుతారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మునుగోడుతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆరు దశాబ్దాలుగా పాతుకుపోయిన ఫ్లోరోసిస్ మహమ్మారిని కేవలం ఆరు ఏళ్లలోనే తరిమికొట్టిన ఘనత సీఎం కేసీఆర్‌ది అని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని.. అమలవుతున్న పథకాల్ని అడ్డుకునేందుకే మోదీ, అమిత్ షా ఇటువంటి కుట్రలకు తెరలేపారని ఆరోపణలు చేశారు.