Minister Jagadish Reddy Fires On Center Orders Over Power Bill Issues: ఏపీ, తెలంగాణ మధ్య ఉన్న విద్యుత్ బకాయిల వ్యవహారం కేంద్రానికి చేరడం.. కేంద్రం జోక్యం చేసుకొని 30 రోజుల్లోనే బకాయిలు చెల్లించమని ఉత్తర్వులు జారీ చేయడం తెలిసిందే! ఈ విషయంపై మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. రాజకీయ దురుద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసిందని ఆగ్రహించారు. ఈ ఉత్తర్వులు పూర్తి అసంబద్ధమైనవని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కోతలు రావాలని కేంద్రం కుట్రలు పన్నుతోందని.. కక్ష్య సాధింపు చర్యల్లో భాగంగానే కేంద్రం ఈ ఉత్తర్వులు జారీ చేసిందని ఆరోపణలు చేశారు. అందుబాటులో ఉన్న వనరులతో దేశం మొత్తం రైతాంగానికి ఉచిత విద్యుత్ ఇవ్వొచ్చని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు బీజేపీకి రుచించడం లేదన్నారు.
కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాన్ని సీఎం కేసీఆర్ దేశవ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగడతారని జగదీశ్ రెడ్డి అన్నారు. ఏపీ నుంచే తెలంగాణకు రూ. 12,941 కోట్లు రావాలని చెబుతున్నా.. కేంద్రం పట్టించుకోవడం లేదని ఫైరయ్యారు. తెలంగాణా వాదనలు వినకుండా.. కేవలం ఏపీ వాదనలు విని, కేంద్రం ఏకపక్ష ఉత్తర్వులు జారీ చేసిందని అన్నారు. విద్యుత్ రంగంలో బీజేపీ సాధించలేని విజయాన్ని, తెలంగాణ సాధించిందన్న అక్కసుతోనే బీజేపీ ఈ పక్షపాత ధోరణి కనబరుస్తోందని చెప్పారు. సంవత్సర కాలంగా తెలంగాణ విద్యుత్ సంస్థలను బీజేపీ అనేక ఇబ్బందులకు గురి చేస్తోందని.. బీజేపీ వైఫల్యాలపై కేసీఆర్ ప్రశ్నించినందుకే తెలంగాణ రాష్ట్రాన్ని టార్గెట్ చేస్తున్నారని పేర్కొన్నారు. డబల్ ఇంజన్ సర్కార్లు విఫలమైన సందర్భంలో.. నూతన రాష్ట్రం తెలంగాణ విజయపథంలో దూసుకెళ్తుండడంతో ఈ కుట్రలకు పాల్పడుతున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు.
ఇదిలావుండగా.. విభజన చట్టం రూల్స్ ప్రకారం కేంద్రం ఆదేశాలతో ఏపీ జెన్‌కో 2014 జూన్ 2 నుంచి 2017 జూన్ 10 వరకు తెలంగాణ విద్యుత్ సంస్థలకు ఏపీ జెన్‌కో విద్యుత్ సరఫరా చేసింది. ఇందుకు గాను ఏపీ జెన్‌కోకి తెలంగాణ రూ. 3441 కోట్లు కట్టాలి. ఈ విషయం పరిష్కారం కాకపోవడంతో.. ఇది కేంద్రం దృష్టికి వెళ్లింది. దీంతో.. 30 రోజుల్లోగా బకాయిపడ్డ మొత్తం సొమ్ము రూ. 3,441.78 కోట్లకు లేట్ పేమెంట్ సర్‌చార్జ్ రూ. 3,315.14 కోట్లు కలిపి.. మొత్తం రూ. 6,756.92 కోట్లు చెల్లించాలని కేంద్ర విద్యుత్ శాఖ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే.. తెలంగాణ వాదన మరోలా ఉంది. విభజనకు ముందు కర్నూలు, అనంతపురం జిల్లాలు తెలంగాణ సెంట్రల్ పవర్ సిస్టమ్ పరిధిలో ఉన్నాయని.. ఈ రెండు జిల్లాల్లో విద్యుత్ సరఫరా డెలవప్‌మెంట్ కోసం విద్యుత్ సంస్థలు రూ. 12, 941 కోట్ల రుణాలు తీసుకున్నాయని తెలంగాణ చెబుతోంది.
