NTV Telugu Site icon

Metro MD NVS Reddy: ఫేస్ 2 కోసం రెండు డీపీఆర్‌లు పంపాం.. కేంద్రం నిర్ణయం కోసం వెయిటింగ్

Hyderabad Metro

Hyderabad Metro

Metro MD SVS Reddy Reveals Metro Phase 2 Details: హైదరాబాద్ మెట్రో ఫేస్-2 కోసం తాము రెండు డీపీఆర్‌లను కేంద్రానికి పంపామని.. కేంద్రం నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఆలోపు రూ.6250 కోట్ల బడ్జెట్‌తో రాయ్‌దుర్గ్ నుంచి శంషాబాద్ వరకూ మెట్రో లైన్‌ను రాష్ట్ర ప్రభుత్వమే నిర్మిస్తుందని అన్నారు. బయో డైవర్సిటీ దగ్గర థర్డ్ లెవెల్‌లో మెట్రో లైన్ వెళ్తుందన్నారు. అనంతరం ఖాజాగుడా మీదుగా వెళ్లి, నానక్‌రామ్ గూడ దగ్గర ఓఆర్ఆర్ (ఔటర్ రింగ్ రోడ్) దగ్గరకు వెళ్తుందన్నారు. ఓఆర్ఆర్ పక్క నుంచి నార్సింగి, రాజేంద్ర నగర్ దాటి శంషాబాద్‌కు మెట్రో మార్గం వెళ్తుందన్నారు. శంషాబాద్ దగ్గర అండర్ గ్రౌండ్ టచ్ అవుతుందని.. ఎయిర్‌పోర్ట్ దగ్గర రెండు స్టేషన్‌లు ఏర్పాటు చేస్తామని తెలిపారు.

మెట్రో స్టేషన్ నుంచి ఎయిర్‌పోర్టుకు లగేజ్ బ్యాగులు తీసుకెళ్లే బాధ ప్రయాణికులకు లేకుండా.. స్టేషన్ నుంచి నేరుగా ఎయిర్‌పోర్టుకు ట్రాన్స్‌ఫర్ చేసే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. ఎంజీబీఎస్ మెట్రో ప్రారంభోత్సవం సమయంలోనే ఈ విషయంపై తనకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారన్నారు. ఎయిర్‌పోర్ట్ ఉన్న చోటే.. అండర్‌గ్రౌండ్‌లో మెట్రో స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఎస్కలేటర్స్, లిఫ్ట్స్, స్టెప్స్ ద్వారా.. నేరుగా ఎయిర్‌పోర్ట్ ఎంట్రన్స్ ఫ్లోర్‌కి చేరుకుంటారన్నారు. ఫస్ట్ ఫేస్‌లో స్టేషన్‌ల విషయంలో తాము 370 కేసుల్ని ఎదుర్కున్నామని.. చాలామంది తమని రకరకాలుగా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు కూడా తమపై కేసులు పెట్టేందుకు సిద్ధంగానే ఉన్నారని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన ప్రాంతాల్ని దృష్టిలో పెట్టుకొని.. స్టేషన్ల లొకేషన్లను ఫిక్స్ చేస్తామని, ప్రయాణికులు నేరుగా కాలనీలోకి వెళ్లేలా స్కై వాకర్స్ నిర్మించేలా ప్లాన్స్ చేస్తున్నామన్నారు.

ప్రస్తుతమున్న మెట్రోతో పోలిస్తే.. ఎయిర్‌పోర్ట్‌కు వేస్తున్న మెట్రోలో వేగం ఎక్కువగా ఉంటుందని ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పుడు మెట్రో హైస్పీడ్ 80 కిలోమీటర్లు కాగా.. ఎయిర్‌పోర్ట్‌కి వేస్తున్న మెట్రో హైస్పీడ్ 120 కిలోమీటర్ల వరకు ఉంటుందని అన్నారు. ఈ స్పీడుతో 31 కిలోమీటర్ల దూరాన్ని 26 నిమిషాల్లోనే చేరుకోవచ్చన్నారు. దీనికితోడు స్టేషన్లు కూడా తక్కువగా ఉంటాయని తెలిపారు. ఇక మెట్రో ఫేస్-1లో భాగంగా.. 69 కిలోమీటర్లు పీపీపీ విధానంలో పూర్తి చేశామని ఎస్వీఎస్ రెడ్డి తెలిపారు. ఈ ఐదు సంవత్సరాల్లో మెట్రోలో 31.5 కోట్ల మంది ప్యాసింజర్‌లు ప్రయాణించారన్నారు.