NTV Telugu Site icon

Marri Sasidhar Reddy: రాజకీయమా.. రిటైర్మెంటా?

Marri Sasidhar Reddy

Marri Sasidhar Reddy

Marri Sasidhar Reddy Fires On Revanth Reddy: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత నుంచి ఆ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. సీరియస్ నేతలందరూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై విరుచుకుపడుతున్నారు. ఇప్పుడు తాజాగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌ రెడ్డి.. రేవంత్‌‌పై సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్‌లో కల్లోలానికి కారణం రేవంత్‌ అని, అతను కాంగ్రెస్‌కు నష్టం కలిగించే పనులు చేస్తున్నాడని ఆరోపించారు. ఇన్‌ఛార్జ్‌ మాణిక్యం ఠాగూర్‌ కూడా రేవంత్‌కు ఏజెంట్‌గా పని చేస్తున్నారే తప్ప, ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. కేసీ వేణుగోపాల్ సైతం పార్టీని తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.

ఎంత సీనియర్లు అయినా.. పార్టీలో ఉండాలంటే ఉండండి, లేదంటే వెళ్లండంటూ రేవంత్ అగౌరవపరిచినా.. అధిష్టానం ఎందుకు అతడ్ని మందలించలేదని శశిధర్ రెడ్డి నిలదీశారు. చండూర్ వేదికపై కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అలా ఎలా తిట్టిస్టారని ప్రశ్నించిన ఆయన.. జానారెడ్డి, ఉత్తమ్ కుమార్, రేవంత్ లాంటి వాళ్లు ఉండి కూడా తిట్టించడం దౌర్భాగ్యమన్నారు. పార్టీ లయలిస్ట్‌లకు పీసీసీ ఇవ్వాలని తాను చెప్పినా.. కాదని రేవంత్‌కి ఇచ్చారని మండిపడ్డారు. రేవంత్ ఇష్టారాజ్యంగా మాట్లాడుతుంటే సిగ్గుగా అనిపిస్తోందన్నారు. హోమ్ గార్డులతో తమని పోల్చడం ఏంటని అడిగిన శశిధర్ రెడ్డి.. మమ్మల్ని క్షమాపణ చెప్పగానే సరిపోదని హెచ్చరించారు.

తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదని మర్రి శశిధర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తాను రాజకీయాల్లో కొనసాగాలా? లేక రిటైర్మెంట్ తీసుకోవాలా? అన్న దానిపై ఆలోచిస్తున్నానన్నారు. ప్రస్తుతానికైతే రాహుల్ గాంధీ ఎవ్వరినీ కలిసే పరిస్థితి లేదన్నారు. చూస్తుంటే.. మర్రి శశిధర్ రెడ్డి కూడా పార్టీకి గుడ్‌బై చెప్పేలా ఉన్నారు. ఇతర సీనియర్ నేతలు సైతం రేవంత్‌పై ఉన్న కోపంతో పార్టీని వీడాలని యోచిస్తున్నట్టు సమాచారం. ఠాగూర్ తీరుతో సంతృప్తిగా లేని ఇతర నేతలు కూడా.. ఆయన్ను తొలగించాలని కోరుతూ అధిష్టానికి ఫిర్యాదులు సైతం చేస్తున్నట్టు తెలుస్తోంది.