Maoist Leader Savitri Surrender Before Telangana Police: మావోయిస్టు లీడర్ సావిత్రి పోలీసుల ఎదుట లొంగిపోయింది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సెక్రటరీగా పని చేసిన రామన్న భార్యే ఈ సావిత్రి. మావోయిస్టు డివిజనల్ కమిటీ మెంబర్‌గా పని చేస్తూ.. ఈమె తాజాగా పోలీసుల ఎదుట హాజరయ్యింది. 2019లోనే రామన్న ఛత్తీస్‌గఢ్ అడవుల్లో గుండెపోటుతో మరణించాడు. 1992లో మావోయిస్టుల ఐడియాలజీపై మక్కువతో.. తనకు 13 ఏళ్ల వయసు ఉన్నప్పుడే సావిత్రి కుంటదళంలో చేరింది. అప్పుడు మావోయిస్టు నాయకుడిగా ఉన్న రామన్న.. 1994లో సావిత్రిని వివాహం చేసుకున్నాడు. తన 30 ఏళ్ల ప్రస్థానంలో 350 మంది ఆదివాసీలను మావోయిస్టు పార్టీలోని ఆమె చేర్పించారు. సావిత్రి కుమారుడు రావుల శ్రీకాంత్ అలియాస్ రంజిత్ కూడా గతేడాది పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.
30 ఏళ్లుగా దళంలో కీలకపాత్ర పోషించిన సావిత్రి.. పోలీసులపై జరిపిన 9 దాడుల్లో చురుగ్గా వ్యవహరించారని డీజీపీ వివరించారు. దండకారణ్యలో మూడు ఆర్గనైజేషన్స్‌లో ఇంచార్జ్‌గా కూడా వ్యవహరించింది. సావిత్రి మొత్తం ఛత్తీస్‌గఢ్‌లోని దళంలోనే పని చేశారని, సావిత్రిపై ఛత్తీస్‌గఢ్‌లో రూ.10 లక్షల రివార్డ్ ఉందని డీజీపీ తెలిపారు. 1992లో లింగన్‌పల్లిలో సావిత్రి పాల్గొన్న ఆపరేషన్‌లో 15 మంది పోలీసులు చనిపోయారని, అలాగే 2000లో ల్యాండ్‌మైన్ బ్లాస్ట్ ద్వారా ఐదుగురు పోలీసులు మృతి చెందారని డీజీపీ వెల్లడించారు. అంతేకాదు.. 2007లో కొత్తచెరువు ల్యాండ్‌మైన్ బ్లాస్ట్‌లో 15 మంది నాగా పోలీస్ బెటాలియన్ వాళ్లు, 2017లో 24 మంది సీఆర్పీఎఫ్ పోలీసులు, 2017లో కొత్తచెరువు జరిగిన కాల్పుల్లో 12 మంది సీఆర్పీఎఫ్ పోలీసులు మరణించినట్టు డీజీపీ పేర్కొన్నారు.
ప్రస్తుతం మావోయిస్టుల్లో ఉన్న చాలామంది సీనియర్లు కనీసం నడిచే పరిస్థితిలో కూడా లేరని, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని సావిత్రి చెప్పినట్టు డీజీపీ తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లో ప్రజాలు మావోలవైపు లేరని, బలవంతంగా మావోయిస్టు పార్టీలోకి చేర్పిస్తున్నారే తప్ప స్వయంగా ఎవరూ రావడం లేదని చెప్పారు. 2019 తన భర్త రామన్న చనిపోయాక ఎవరూ తనకు సమాచారం ఇవ్వలేదని, అంతిమయాత్రలో పాల్గొనేటప్పుడు సమాచారం ఇచ్చారని సావిత్రి ఆవేదన వ్యక్తం చేశారు. రామన్న చనిపోయినప్పటి నుంచి మావోలు తనని దూరం పెట్టడంతో పాటు సైడ్ చేయాలని చూస్తున్నారని.. దీంతో తాను లొంగిపోతున్నట్టు సావిత్రి చెప్పింది.
కాగా.. పోలీసులకు లొంగిపోయినందుకు తక్షణ సాయం కింద రూ. 50 వేలు నగదును పోలీసులు అందించారు. అంతేకాదు.. మావోయిస్టులు లొంగిపోతే వారికి కావాల్సిన వసతులు, రివార్డు, ప్రభుత్వం నుండి రావాల్సిన బెనిఫిట్స్ అన్ని ఇచ్చేలా చూస్తామన్నారు. జనజీవన స్రవంతిలో కలిసిపోయేలా చేస్తామని హామీ కూడా ఇచ్చారు. ప్రస్తుతం తెలంగాణ మావోయిస్టు కమిటీ ఇన్‌ఛార్జ్ కార్యదర్శిగా చంద్రన్న ఉన్నారని డీజీపీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు.
