Site icon NTV Telugu

భక్తులతో కిక్కిరిసిన మేడారం..

తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా మేడారంలో సమ్మక్క-సారలమ్మ జాతర వైభవం కన్నులపండువగా కొనసాగుతోంది. పెద్దఎత్తున తరలివస్తున్న భక్తజనంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. భక్తుల పుణ్యస్నానాలతో జంపన్న వాగు కళకళలాడుతోంది. ఫిబ్రవరి 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు మేడారం జాతర జరగనుంది.. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరున్న మేడారం జాతరకు దేశవ్యాప్తంగా భక్తులు తరలివస్తారు. ఈ నేపథ్యంలోనే సమ్మక్క సారక్క జాతర కోసం అక్కడ అధికారులు ఏర్పాట్లను చేస్తున్నారు.

అయితే ఆదివారం సెలవు దినం కావడం తో భక్తులు వారి కుటుంబ సభ్యులతో కలిసి పసుపు, కుంకుమలతో వన దేవతలకు పూజలు చేసి బంగారాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో మేడారం పరిసరాలు ప్రస్తుతం రద్దీగా మారిపోయాయి. ఈ నేపథ్యంలోనే అక్కడి అధికారులు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నారు.. భక్తులందరూ కరోనా నియమ నిబంధనాలు పాటిస్తూ అమ్మవారిని దర్శించుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. భక్తుల రద్దీతో సమ్మక్క సారక్క గద్దెలు నిండిపోయాయి.

Exit mobile version