KCR Press Meet Live Updates
-
విపక్షాలకు కేసీఆర్ సవాల్
తెలంగాణలోని విపక్షాలకు సీఎం కేసీఆర్ సవాల్ విసిరారు. ముందస్తు ఎన్నికల తేదీ చెప్తే తాను అసెంబ్లీని రద్దు చేస్తానని.. దమ్ముంటే ఎన్నికల తేదీని ఖరారు చేయాలని కేసీఆర్ సవాల్ చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఈస్ట్ మన్ కలర్ తరహాలో కలలు కంటున్నారని కేసీఆర్ ఎద్దేవా చేశారు.
-
పీకే ఫ్రెండ్ మాత్రమే
పీకే తనకు ఫ్రెండ్ మాత్రమే.. ఆయన నాకు చెప్పేదేముంటుందని కేసీఆర్ అన్నారు. పీకే లాంటి ఫ్రెండ్స్ తనకు చాలా మంది ఉన్నారన్నారు. మూడు, నాలుగు పార్టీలతో ఫ్రంట్ పెడితే ఏమొస్తుందని.. ఆ కిచిడీ ఫ్రంట్ నాలుగురోజులు కూడా నిలవదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికలకు సంబంధించి తమ ఏజెండా ఏంటో త్వరలోనే చెప్తానని కేసీఆర్ తెలిపారు.
-
జాతీయ రాజకీయాలపై స్పష్టత
జాతీయ రాజకీయాలపై కేసీఆర్ స్పష్టత ఇచ్చారు. భావసారుప్యత ఉన్న పార్టీలతో ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని.. ఫ్రంట్‌తోనే మోదీ ప్రభుత్వాన్ని పడగొడతామని కేసీఆర్ స్పష్టం చేశారు. అవసరమైతే జాతీయ పార్టీని ఏర్పాటు చేస్తామని కేసీఆర్ తెలిపారు.
-
మనకు 4వేల టీఎంసీల ప్రాజెక్టులు వద్దా?
శ్రీలంకలో భారత ప్రధానికి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుంటున్నారు..భారత ప్రధాని మీద శ్రీలంక మంత్రి ఆరోపణలు చేశారు.. దేశం పరువు పోలేదా అని కేసీఆర్ ప్రశ్నించారు. ప్రపంచ దేశాలలో ఎక్కడా లేని విధంగా ఇండియాలో ఉన్న 80 కోట్ల ఎకరాల భూమిలో 50 శాతం అంటే 40 కోట్ల ఎకరాల భూమి వ్యవసాయానికి అనుకూలంగా ఉంది.. మనకు అమెరికా, చైనా తరహాలో 4వేల టీఎంసీల నీటి ప్రాజెక్టులు వద్దా అని కేసీఆర్ నిలదీశారు.
-
మాతో గోక్కుంటే అగ్గే
నేనెవరికీ భయపడను.. నాకు మనీ లేదు.. లాండరింగ్ లేదు.. మాతో గోక్కుంటే అగ్గే.. మీరు మాతో గోక్కున్నా.. గోక్కోపోయినా దేశ ప్రజల కోసం నేను మిమ్మల్ని గోకుతూనే ఉంటానని కేసీఆర్ వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ జాతీయ పార్టీ పెడితే తప్పేంటి.. మోదీ కూడా తన లాగే గుజరాత్ రాష్ట్రానికి సీఎంగా పనిచేశాడని.. ఆయన జాతీయ రాజకీయాల్లోకి వస్తే తప్పులేనిది.. తాను వస్తే తప్పేంటని కేసీఆర్ ప్రశ్నించారు.
-
దమ్ముంటే తెలంగాణలో ఏక్‌నాథ్ షిండే వంటి వాడిని తీసుకురావాలి
బీజేపీ ఏక్‌నాథ్ షిండే తరహాలో ఆనాడు కాంగ్రెస్ కూడా ఎన్టీ రామారావుపై నాదెండ్ల భాస్కర్‌ను ప్రయోగించిందని.. తర్వాత ప్రజలే తిరగబడి మళ్లీ ఎన్టీఆర్‌ను తెచ్చుకున్నారని.. నరేంద్ర మోదీకి దమ్ముంటే తమిళనాడు, తెలంగాణలో ఏక్‌నాథ్ షిండేలను తీసుకురావాలని కేసీఆర్ సవాల్ విసిరారు. బీజేపీ పిట్ట బెదిరింపులకు, ఉడత ఊపులకు భయపడేవారు ఇక్కడెవరూ లేరని కేసీఆర్ అన్నారు.
-
ఎన్నికల కోసమే కాశీ ఘాట్ కట్టారు
కాశీ ఘాట్ ఎన్నికల కోసమే కట్టారు.. పవిత్ర పుణ్యక్షేత్రాన్ని కూడా ఎన్నికలకు వాడుకుంటారా? ఇటీవల వర్షాలకు ప్రధాన గోపురం కూలిపోయింది.. ప్రజల సెంటిమెంట్ ప్రకారం కాశీలో ప్రధాన గోపురం కూలిపోవడం దేశానికి మంచిది కాదని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
-
అగ్నిపథ్ స్కీం పెద్ద బ్లండర్
దేశానికి పాకిస్తాన్ ప్రమాదకరం కాదని, చైనాతోనే అసలు సమస్య అని రక్షణ రంగ నిపుణులు తనతో అన్నారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. రక్షణ రంగంలో అగ్నిపథ్ స్కీం పెద్ద బ్లండర్ అన్నారు. దేశానికి ప్రాణమిచ్చే జవాన్ తయారుకావాలంటే ఏడెనిమిదేళ్లు పడుతోందని.. 140కోట్ల జనాభా ఉన్న దేశాన్ని ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే సరికాదని కేసీఆర్ అన్నారు. కశ్మీర్ ఫైల్స్ సినిమా తీసి గొప్పలు చెప్పుకున్నారని.. ఇప్పుడు అక్కడ తమకు భద్రత లేదని కశ్మీరీ పండిట్లు రోజూ ధర్నాలు చేస్తున్నారని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
-
బీజేపీ కండువా కప్పుకోగానే కేసులన్నీ మాఫీ అవుతాయా?
వ్యాపారవేత్తలను, రాజకీయవేత్తలను బెదిరించి వాళ్లకు సీబీఐ, ఈడీ నోటీసులు ఇచ్చి పార్టీలో చేర్చుకుంటున్నారు.. సుజనాచౌదరి, సీఎం రమేష్, ఈటల రాజేందర్, జ్యోతిరాదిత్య సింధియాకు నోటీసులు వచ్చాయని, బీజేపీలోకి రాగానే వాషింగ్ పౌడర్ నిర్మాలాగా కేసులు మాఫీ అయ్యాయని కేసీఆర్ తన ప్రెస్ మీట్లో ఓ వీడియోను ప్రదర్శించారు.
-
మోదీ విధానాలపైనే మాకు అభ్యంతరం
దేశంలో బొగ్గు నిలువలు ఉన్నా ఎందుకు ఇంపోర్ట్ చేసుకుంటున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని కేసీఆర్ ప్రశ్నించారు. రూ.4వేలకు దొరికే బొగ్గును రూ.30 వేల నుంచి రూ.40 వేలు పెట్టి కొనాలనడం జబర్దస్తీ కాదా అని నిలదీశారు. భారతదేశ చరిత్రలోనే అత్యంత అసమర్థ ప్రధాని నరేంద్ర మోదీ.. మాకు వ్యక్తిగతంగా మోదీతో ఎలాంటి విరోధం లేదని.. ఆయన విధానాలపైనే తమకు అభ్యంతరమని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
-
బ్యాంకు దొంగలను ఎందుకు పట్టుకోవడం లేదు?
దేశంలో బ్యాంకు లూటీలు ప్రధాని మోదీకి తెలిసే జరుగుతున్నాయి.. బ్యాంకు దొంగలను పట్టుకోవడం మోదీకి చేతకావడం లేదా? మోదీ రాకముందు దేశంలో 4 లక్షల కోట్ల ఎన్‌పీఏలు ఉంటే ఇప్పుడు 12 లక్షల కోట్లు ఉన్నాయని కేసీఆర్ ఆరోపించారు. బ్యాంకు లూటీల్లో బీజేపీ నేతలు కూడా భాగస్వాములేనని కేసీఆర్ విమర్శించారు.
-
పీయూష్ గోయల్ కాదు.. పీయూష్ గోల్‌మాల్
కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌పై కేసీఆర్ సెటైర్లు వేశారు. పీయూష్ గోయల్ కాదు ఆయన పీయూష్ గోల్‌మాల్ అన్నారు. ఆయన నెత్తిలేని సన్నాసి.. రైతులను అవమానించేలా మాట్లాడారని ఫైరయ్యారు. తెలంగాణ ప్రజలు నూకలు తినాలా అని కేసీఆర్ ప్రశ్నించారు. ఈ విషయంలో భారతీయ కిసాన్ సంఘ్ సైతం కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించిందని కేసీఆర్ గుర్తుచేశారు.
-
దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నెలకొంది
బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ నోటికి వచ్చినట్లు మాట్లాడారు.. ఆమె వ్యాఖ్యలను తప్పుబడితే సుప్రీంకోర్టుపైనా మాజీ జడ్జిలతో లేఖలు రాయిస్తారా? న్యాయవ్యవస్థలనే బెదిరించే స్థాయికి కేంద్రం దిగజారింది.. ఆరోజు ఇందిరాగాంధీ డిక్లేర్ ఎమర్జెన్సీ ప్రకటిస్తే.. ప్రస్తుతం దేశంలో అన్‌డిక్లేర్ ఎమర్జెన్సీ నెలకొందని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
-
దేశ జీడీపీ కంటే తెలంగాణ జీడీపీనే ఎక్కువ
తెలంగాణ జీడీపీ 128.3% పెరిగింది.. అదే సమయంలో దేశ జీడీపీ 89.6 శాతమే పెరిగింది.. దేశం కంటే తెలంగాణ జీడీపీ పెరుగుదల 38.2 శాతం ఎక్కువగా ఉంది, బీజేపీయేతర రాష్ట్రాలలోనే తలసరి ఆదాయం ఎక్కువగా ఉందని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
-
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని దించి తీరతాం
దేశంలో ఏడాదికి 30 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు.. కేంద్రంలో బీజేపీ పోయి తెలంగాణ లాంటి ప్రభుత్వం రావాలి, కేంద్ర ప్రభుత్వం అసమర్ధ విధానాల వల్ల తెలంగాణ 3 లక్షల కోట్లు నష్టపోయింది.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని దించి తీరతాం.. మోదీ చెప్పినట్లే డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిందే.. బీజేపీ నేతలకు కళ్లు నెత్తికెక్కి అహంకారంతో మాట్లాడుతున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
-
ఇక్కడికి వచ్చి మమ్మల్ని తిట్టిపోతారా?
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు రాంగ్ ప్లేస్ సెలక్ట్ చేసుకున్నారు.. ఇక్కడికి వచ్చి ఇక్కడున్న ప్రభుత్వాన్ని తిట్టిపోతారా?.. బీజేపీ తెలివితక్కువ విధానాల వల్ల దేశాన్ని నాశనం చేశారు.. దేశంలో నిరుద్యోగ రేటు ఎన్నడూ లేనంతగా పెరిగిపోయిందని కేసీఆర్ ఆరోపించారు.
-
ఒక్క ప్రశ్నకూ సమాధానం చెప్పలేదు
ప్రధాని మోదీకి నిక్కచ్చిగా కొన్ని ప్రశ్నలు వేశాం.. ఒక్క ప్రశ్నకూ సమాధానం చెప్పలేదు.. తెలంగాణకు వాళ్లు చేసిందీ లేదు.. అయ్యేదీ లేదు.. 8 ఏళ్లలో దేశానికి చేసిన ఒక్క మంచి పని గురించి మోదీ చెప్పాలి.. విద్యుత్, మంచినీళ్లు ఇచ్చే తెలివి కూడా బీజేపీకి లేదు.. ధరల పెరుగుదల, నిరుద్యోగాన్ని, ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయడం మోదీకి చేతకాదు అంటూ కేంద్ర ప్రభుత్వంపై కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు.
-
రూపాయి పతనం అవివేకమా? చేతకానితనమా?
రూపాయి విలువ దారుణంగా పతనం కావడానికి అవివేకమా? చేతకానితనమా? అనేది ప్రజలకు బీజేపీ సమాధానం చెప్పాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా 2014 ఎన్నికలకు ముందు రూపాయి పతనంపై మోదీ మాట్లాడిన ప్రసంగం వీడియోను కేసీఆర్ ప్రదర్శించారు.
-
కేంద్రమంత్రులు నోటి దూల తీర్చుకుని పోయారు
ప్రధాని మోదీ హైదరాబాద్ వచ్చి ఏం మాట్లాడారో భగవంతుడికే తెలియాలని కేసీఆర్ చురకలు అంటించారు. ఆయనకు ముందు మాట్లాడిన కొందరు కేంద్ర మంత్రులు ఏదో కేసీఆర్‌ను తిట్టి నోటిదూల తీర్చుకునిపోయారని.. దేశాన్ని బీజేపీ జలగలా పట్టి పీడిస్తోందని కేసీఆర్ ఆరోపించారు.
-
వర్షాలు, వరదల్లో సాహసాలు చేయొద్దు
వర్షాలు, వరదల్లో సాహసాలు చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా.. నల్గొండలో ప్రమాదవశాత్తూ గోడకూలి చనిపోయిన ఇద్దరి కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇస్తామని కేసీఆర్ వెల్లడించారు.
-
నాలుగు రోజుల పాటు అతి భారీ వర్షాలు
వచ్చే నాలుగు రోజులు అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.. అందుకే విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాం.. ఎస్సారెస్పీ ఈ రాత్రికే నిండిపోయినా ఆశ్యర్యపడాల్సిన అవసరం లేదని కేసీఆర్ అన్నారు.