వికారాబాద్ జిల్లా దోమ మండలంలో చిరుతపులి సంచారం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. దిర్సంపల్లి తండా పంచాయతీ పరిధిలోని గోవింద్ బుడ్యా నాయక్ తండాలో చిరుతపులి ప్రత్యక్షమైంది. స్థానిక రైతు నేనావత్ రాజుకు చెందిన బర్రె దూడపై చిరుతపులి అకస్మాత్తుగా దాడి చేసింది. దూడను హతమార్చడమే కాకుండా, దానిని కొంత భాగం తినివేయడంతో తండావాసులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
పాటముద్రల పరిశీలన.. వీడియో తీసిన రైతులు
చిరుతపులి దాడి చేసిందంటూ తండావాసులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ సిబ్బంది మృతి చెందిన దూడ కళేబరాన్ని, అక్కడ ఉన్న పాదముద్రలను పరిశీలించారు. అదే సమయంలో సమీపంలోని బండరాయిపై కూర్చుని ఉన్న చిరుతపులిని స్థానిక రైతులు తమ మొబైల్స్‌లో వీడియో తీశారు. రైతులు చిత్రీకరించిన ఆ వీడియోను అటవీశాఖ సిబ్బంది కూడా పరిశీలించి ధృవీకరించారు.
ప్రజల్లో భయాందోళన.. అధికారుల హెచ్చరికలు
జనావాసాల మధ్యలోకి చిరుతపులి రావడంతో పరిసర తండాలు, గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఈ నేపథ్యంలో రాత్రి వేళల్లో ఎవరూ ఒంటరిగా పొలాల వద్దకు వెళ్లవద్దని అటవీశాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. తక్షణమే చిరుతపులి ఆచూకీని గుర్తించి తమకు రక్షణ కల్పించాలని తండావాసులు అధికారులను తీవ్రంగా కోరుతున్నారు.

