Leopard : హైదరాబాద్ నగరంలో చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది. తాజాగా గోల్కొండలోని ఇబ్రహీంబాగ్ మిలిటరీ ప్రాంతంలో రోడ్డును దాటుతున్న చిరుత దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. తారామతి వెనుకభాగం నుండి మూసీ నది వైపు చిరుత కదులుతున్నట్లు సమాచారం అందింది. ఈ విషయాన్ని గమనించిన గోల్కొండ పోలీసులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
గత కొన్ని రోజులుగా మంచిరేవుల, నార్సింగి ప్రాంతాల్లో చిరుత సంచారం కనిపిస్తోందని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. చిరుతను పట్టుకునేందుకు గ్రేహౌండ్స్ ప్రాంతంలో అటవీశాఖ అధికారులు నాలుగు బోన్లు మరియు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. అయితే చిరుత ఇప్పటి వరకు బోన్లలో చిక్కకుండా చాకచక్యంగా తప్పించుకుని తిరుగుతోందని సమాచారం. ఈ క్రమంలోనే ఇబ్రహీంబాగ్ మిలిటరీ ప్రాంతంలో అది రోడ్డును దాటినట్లు గమనించబడింది.
అటవీశాఖ అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో రాత్రి సమయంలో బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. చిరుత సంచారం కొనసాగుతున్నందున దానిని పట్టుకునేందుకు మరింత చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు.
