KTR Says Indian Media Turned As Modia: మన దేశంలోని మీడియా ‘మోడీయా’గా మారిపోయిందని తెలంగాణ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎనిమిదేళ్లుగా మన్‌కీ బాత్ తప్ప.. ఆయన మీడియాతో మాట్లాడిన సందర్భం ఒక్కటి కూడా లేదన్నారు. ‘‘అమెరికా అధ్యక్షుడు జో బైడన్ హెలికాప్టర్ క్యాబిన్ ఇక్కడ తయారవుతోంది, ఐటీలో మంచి కంపెనీలు హైదరాబాద్‌లో ఉన్నాయి.. ఇలాంటి వార్తలు రాయండి, ఇవి వార్తలు కావా?’’ అని కేటీఆర్ ప్రశ్నించారు. మన విషయం మనం చెప్పుకుంటే తప్పేంటని నిలదీసిన ఆయన.. ఒకవేళ తాము తప్పు చేస్తే చీల్చి చెండాడండని అన్నారు. ఎప్పుడూ ఐటీ, ఈడీ దాడుల వార్తలేనా? మంచి చేసినప్పుడు ఎందుకు చూపించడం లేదు? అనితర సాధ్యమైన ఇంజనీరింగ్ ఫీట్ చేస్తే, ఎందుకు చూపించడం లేదు? అని కేటీఆర్ మండిపడ్డారు.
మిషన్ భగీరథ వల్ల చెరువు కట్టలు తెగడం లేదన్న కేటీఆర్.. ఇది వార్త కాదా? అని మీడియాని నిలదీశారు. కానీ.. కట్టలు తెగితే మాత్రం వెంటనే వార్తలు రాసేస్తారని అసంతృప్తి వ్యక్తం చేశారు. పాలు, చేపల ఉత్పత్తిలో తెలంగాణ ముందంజలో ఉందని.. ఇవన్నీ వార్తలు కావా? అని అడిగారు. అన్ని రంగాల్లో ఉన్న పాజిటివ్ వార్తలను ఎందుకు చూపించడం లేదన్నారు. ఏదైతే సెంటర్ పాయింట్ అవ్వాలో.. ఆ వార్తలు వేయడం లేదని ఆవేదన చెందారు. దేశ ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నం అవుతున్నా, ద్రవ్యోల్బణం పడిపోతున్నా, నిరుద్యోగం పెరుగుతున్నా.. వాటిపై వార్తలు రావని చెప్పారు. కానీ.. ఏం తినాలి, ఏం వేసుకోవాలి అనేవి మాత్రం వార్తలొస్తాయన్నారు. ‘‘అయితే జుమ్లా మాటలు, లేకపోతే హమ్లా?’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిటీలో వర్షం వచ్చినప్పుడు వార్తలు చూస్తే.. మొత్తం మునిగినట్టు అనిపిస్తుందన్నారు. ఈరోజుల్లో వార్తలు చూస్తే.. ఏది వార్తో, ఏది వాస్తవమో అర్థం కావడం లేదన్నారు. తాను పాత్రికేయుల్ని అనడం లేదని, మునుపటిలాగా వార్తల్లో నైతిక బలం లేదని పేర్కొన్నారు.
తనకు తండ్రి నేర్పిన అలవాట్లలో పేపర్ చదవడం ఒకటని, రోజుకి తాను 13 పేపర్లు చదువుతానని కేటీఆర్ తెలిపారు. మీడియా కంటే, మీడియాలో పని చేసే కలం వీరుల పనితనం గొప్పదని కొనియాడారు. నిజాం కాలంలో షోయబ్ ఉల్లాఖన్, గోల్కొండ పత్రిక నడిపిన సురవరం ప్రతాపరెడ్డి లాంటి కలం వీరుల్లో నైతిక బలం ఉందన్నారు. కెసిఆర్ పార్టీ పెట్టిన సమయంలో మీడియా యాజమాన్యం సపోర్ట్ లేదని, కానీ మీడియాలో ఉన్న జర్నలిస్టులే తమకు సపోర్ట్‌గా నిలబడ్డారని అన్నారు. అప్పుడు మద్దతుగా నిలిచిన జర్నలిస్టులకు సముచిత స్థానం ఇచ్చి, గౌరవించుకున్నామన్నారు. దేశంలో ఎక్కడ లేని జర్నలిస్ట్ సంక్షేమాన్ని తెలంగాణ ప్రభుత్వం అందిస్తోందన్నారు. సంక్రాంతి తర్వాత మీడియా ఎకాడమీ బిల్డింగ్ ప్రారంభిస్తామని కేటీఆర్ చెప్పారు.
