Site icon NTV Telugu

Koti Deepotsavam 2025 Day 7 : సకల కార్యసిద్ధి శక్తిపీఠ క్షేత్రం.. “అలంపురం శ్రీ జోగులాంబ కల్యాణోత్సవం”

Jogulamba Kalyanam

Jogulamba Kalyanam

Koti Deepotsavam 2025 Day 7 : హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్ స్టేడియం శివానుభూతి కాంతులతో తళుక్కుమంది. ఆధ్యాత్మికత, భక్తి, ఆరాధనల అద్భుత సమ్మేళనంగా కోటి దీపోత్సవం 2025 మహోత్సవం ఏడవ రోజు ఘనంగా కొనసాగింది. ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా కార్తీకమాసంలో నిర్వహించే ఈ మహోత్సవం, ఈసారి మరింత విశేషంగా, విశాలంగా భక్తుల మనసులను ఆకర్షిస్తోంది.

వేలాది మంది భక్తులు “ఓం నమః శివాయ” నినాదాలతో దీపాలు వెలిగించగా, ఎన్టీఆర్ స్టేడియం ఆ క్షణాల్లో దేవలోకాన్ని తలపించింది. ఒక్కొక్క దీపం వెలిగిన క్రమంలో కైలాస సమానమైన ఆ వెలుగు వేదికను కప్పేసింది. “ప్రతి దీపం ఒక ఆత్మజ్యోతి” అనే ఆధ్యాత్మిక సందేశం ప్రతి భక్తుడి హృదయాన్ని తాకింది. 2012లో ‘లక్ష దీపోత్సవం’గా ఆరంభమైన ఈ భక్తి యజ్ఞం, 2013లో ‘కోటి దీపోత్సవం’గా రూపాంతరం పొంది, నేడు ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక ఉత్సవాలకు ప్రతీకగా నిలిచింది. ప్రతీ సంవత్సరం ఈ వేదిక భక్తి కాంతులతో, హారతుల వెలుగులతో నిండిపోతుంది.

ఏడవ రోజు ప్రత్యేక కార్యక్రమాలు భక్తి తరంగాలను మరింత పెంచాయి. తిరుపతికి చెందిన మాతాజీ శ్రీ రమణానంద భారతి స్వామి ప్రధాన అతిథిగా విచ్చేసి భక్తులకు ఆధ్యాత్మిక సందేశాన్ని అందించారు. అలాగే ఆధ్యాత్మికతవేత్త డాక్టర్ అనంతలక్ష్మి ప్రవచనామృతంతో భక్తులకు ఆత్మశాంతి ప్రసాదించారు. వేదికపై జరిగే కోటి కుంకుమార్చన, ఒడిబియ్యం సమర్పణ, దుర్గామాత పూజలు, కోటిలింగేశ్వరునికి 108 పంచ హారతులు భక్తులను మంత్ర ముగ్ధులను చేశాయి. సప్తహారతుల ఘంటానాదం, హారతుల కాంతులు, భక్తుల నినాదాలు… ఇవన్నీ కలిసిన ఆ క్షణం భూమిపై ఒక ఆధ్యాత్మిక కైలాసంలా అనిపించింది.

ప్రధాన ఆకర్షణగా అలంపురం శ్రీ జోగుళాంబ బాల అమ్మవారి కళ్యాణోత్సవం ఎంతో వైభవంగా జరిగింది. పల్లకీ, గజ వాహనాలతో సాగిన వాహన సేవ భక్తుల హృదయాలను దోచుకుంది. లింగోద్భవ దర్శనం, సప్తహారతులతో ఈరోజు కార్యక్రమం కన్నుల పండువగా ముగిసింది. ఈ ఉత్సవానికి కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ గారు ముఖ్య అతిథిగా హాజరై, కోటి దీపోత్సవం భక్తి మహిమను అభినందించారు. ఈ పవిత్ర ఉత్సవం నవంబర్ 13 వరకు అంగరంగ వైభవంగా కొనసాగనుంది. ప్రతిరోజు సాయంత్రం 5.30 గంటలకు ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయి. భక్తుల రాకపోకలకు సౌకర్యంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు.

Delhi Airport: సాంకేతిక సమస్య.. 800 విమానాలు ఆలస్యం

Exit mobile version