Site icon NTV Telugu

Koti Deepotsavam 2025 Day 8 : ఇల కైలాసంలో కన్నుల పండుగగా వేములవాడ రాజన్న కల్యాణం

Rajanna Kalyanm

Rajanna Kalyanm

Koti Deepotsavam 2025 Day 8 : కోటి దీపోత్సవం 2025 ఎనిమిదో రోజు ఎన్టీఆర్ స్టేడియం అపూర్వమైన ఆధ్యాత్మిక కాంతులతో మిన్నంటింది. ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణం శివభక్తి జ్యోతులతో నిండిపోగా, భక్తి, ఆరాధనలతో నిండిన ఆ వాతావరణం ప్రతి భక్తుడి మనసును మైమరిపించింది. కార్తీకమాసం సందర్భంగా ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీలు ప్రతీ ఏటా నిర్వహించే ఈ మహోత్సవం, ఈసారి మరింత వైభవంగా, మహిమాన్వితంగా సాగుతోంది.

వేలాదిగా తరలి వచ్చిన భక్తులు “ఓం నమః శివాయ” నినాదాలతో దీపాలు వెలిగించగా, ఒక్కో దీపం వెలుగుతో కైలాస సౌందర్యాన్ని తలపించే దివ్య కాంతి వేదిక మొత్తం వ్యాపించింది. “ప్రతి దీపం ఒక ఆత్మజ్యోతి” అనే సందేశం భక్తుల హృదయాల్లో ఆధ్యాత్మిక స్పర్శను కలిగించింది. 2012లో ‘లక్ష దీపోత్సవం’గా ప్రారంభమైన ఈ భక్తి యజ్ఞం, 2013లో ‘కోటి దీపోత్సవం’గా రూపాంతరం పొంది, నేడు అంతర్జాతీయ ఆధ్యాత్మికోత్సవాలకు ప్రతీకగా నిలుస్తోంది.

 

 

ఈ పవిత్ర మహోత్సవంలో భాగంగా ఎనిమిదో రోజు నిర్వహించిన విశేష కార్యక్రమాలు భక్తి తరంగాలను మరింత పెంచాయి. హల్దీపురం మఠాధిపతి, వైశ్య కుల గురువులు పూజ్యశ్రీ వామనాశ్రమ మహాస్వామీజీ అనుగ్రహ భాషణం అందించగా, బ్రహ్మశ్రీ వేదాంతం రాజగోపాల చక్రవర్తి ప్రవచనామృతంతో భక్తులను పరవశింపజేశారు. వేదికపై కాజీపేట శ్వేతార్క మహాగణపతికి కోటి గరికార్చన ఘనంగా నిర్వహించారు. ఉజ్జయిని మహాకాళునికి భస్మహారతి భక్తుల్లో పరమానందాన్ని నింపింది.

వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి కల్యాణోత్సవం మహోత్సాహంగా సాగి, అనంతరం స్వామివారు నంది వాహనంపై దర్శనమిచ్చిన దృశ్యాలు వేదికను క్షణాల్లో దేవలోకంగా మార్చాయి. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా భక్తి వాతావరణానికి అందాన్ని తెచ్చాయి. లింగోద్భవ దర్శనం, సప్తహారతుల అద్భుత క్షణాలతో ఈరోజు కార్యక్రమం కన్నుల పండువగా ముగిసింది. నేటి కోటి దీపోత్సవం కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. అయితే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కోటి దీపోత్సవ వేద పండితులు వేదాశీర్వచనమిచ్చారు. ఈసందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ.. భక్తి టీవీ కోటి దీపోత్సవాన్ని రాష్ట్రపండుగగా గుర్తిస్తామని, జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్రానికి లేఖ రాస్తామని అన్నారు. అనంతరం నేటి కోటి దీపోత్సవంలో తొలి కార్తీక దీపం వెలింగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ పవిత్ర దీపాల మహోత్సవం నవంబర్ 13 వరకు అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. ప్రతిరోజూ సాయంత్రం 5.30 గంటలకు ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తులను శివానుభూతిలో ముంచేస్తాయి. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.

Varanasi: ప్రధాని పర్యటనకు ముందు.. జవాన్, బీజేపీ ఎమ్మెల్యే మధ్య కుమ్ములాట..!

 

 

 

Exit mobile version