Site icon NTV Telugu

Koti Deepotsavam 2025 Day 4: భక్తి జ్యోతులతో మెరిసిన ఎన్టీఆర్‌ స్టేడియం.. వైభవంగా శ్రీరంగం శ్రీ రంగనాథస్వామి కల్యాణం

Koti Deepotsavam

Koti Deepotsavam

Koti Deepotsavam 2025 Day 4: హైదరాబాద్‌లో భక్తి తరంగాలు ఉప్పొంగుతున్నాయి. ఏటా కార్తీకమాసం సందర్భంగా ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీ ఆధ్వర్యంలో నిర్వహించే కోటి దీపోత్సవం 2025 మహోత్సవం నాలుగవ రోజు అద్భుతమైన భక్తి వాతావరణంలో సాగింది. వేలాది మంది భక్తులు ఎన్టీఆర్‌ స్టేడియంలో దీపాలు వెలిగిస్తూ “ఓం నమః శివాయ” నినాదాలతో భక్తి కాంతులతో వెలుగులు నింపారు. 2012లో లక్ష దీపోత్సవంగా ప్రారంభమై, 2013లో కోటి దీపోత్సవంగా రూపాంతరం పొందిన ఈ మహోత్సవం, ప్రతి ఏడాది భక్తులకు కొత్త ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తోంది. కార్తీకమాస భక్తి వైభవానికి ప్రతీకగా నిలిచిన ఈ దీపాల మహోత్సవం, “ప్రతి దీపం ఒక ఆత్మజ్యోతి” అనే ఆధ్యాత్మిక సందేశాన్ని ప్రపంచానికి చాటుతోంది.

నాల్గవరోజు కార్యక్రమం గురువుల ఆశీస్సులతో, వేద మంత్రాలతో ప్రారంభమైంది. పూజ్యశ్రీ పరిపూర్ణానందగిరి మహాస్వామీజీ (శ్రీ వ్యాసాశ్రమం పీఠాధిపతి, ఏర్పేడు), పూజ్యశ్రీ వామనాశ్రమ మహాస్వామీజీ (హల్దీపురం పీఠాధిపతి, వైశ్య కుల గురువులు) ఆధ్వర్యంలో జరిగిన అనుగ్రహ భాషణం భక్తుల హృదయాలను తాకింది. తదుపరి బ్రహ్మశ్రీ డాక్టర్‌ కాకునూరి సూర్యనారాయణ మూర్తి ప్రవచనామృతం భక్తులను ఆధ్యాత్మిక చింతనలో ముంచెత్తింది. అయితే.. నాల్గవ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సతీసమేతంగా విచ్చేశారు.

 

అలాగే వేదికపై శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం, రజత గోమాత పూజ, శత అష్టోత్తర పంచహారతులు వైభవంగా నిర్వహించబడ్డాయి. భక్తులు శ్రద్ధాభక్తులతో పాల్గొని ఆధ్యాత్మిక పరవశాన్ని పొందారు. అనంతరం శ్రీరంగం శ్రీ రంగనాథస్వామి కల్యాణం, పల్లకీ వాహన సేవతో భక్తులకు దివ్య దర్శనం లభించింది. చివరలో సప్తహారతి, లింగోద్భవ దర్శనంతో నాలుగవ రోజు వేడుక కన్నుల పండువగా ముగిసింది. వేలాది దీపాలతో ప్రకాశించిన వేదిక కైలాసాన్ని తలపించింది.

కోటి దీపోత్సవం 2025 వేడుకలు ఈ నెల 13వ తేదీ వరకు అంగరంగ వైభవంగా కొనసాగనున్నాయి. ప్రతి రోజు సాయంత్రం 5.30 గంటలకు ఎన్టీఆర్‌ స్టేడియం వేదికగా ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయి. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేశారు. భక్తి, ఆరాధన, ఆనందాల సమ్మేళనంగా ఈ కోటి దీపోత్సవ మహోత్సవం అందరినీ ఆహ్వానిస్తోంది.

Sri Sri Ravi Shankar: భారత్‌కు గర్వకారణం.. శ్రీ శ్రీ రవిశంకర్‌కు వరల్డ్ లీడర్ ఫర్ పీస్ అండ్ సెక్యూరిటీ అవార్డు

Exit mobile version