తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రాష్ట్ర నాయకత్వం పై డైరెక్ట్ అటాక్ చేశారు. తాను లోలోపల రగిలిపోతున్న అంశాలన్నింటిపైన ఒక్క సారిగా కుండబద్దు కొట్టినట్టు చెప్పేశారు. వరంగల్ లో తెలంగాణ కాంగ్రెస్ నిర్వహించిన రైతు సంఘర్షణ సభనే ఇందుకు వేదికగా చేసుకున్నారు ఆయన. సభకు చీఫ్ గెస్ట్‌గా వచ్చిన పార్టీ అధినాయకుడు రాహుల్‌గాంధీ సమక్షంలోనే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తాను చెప్పాలనుకున్నది చెప్పేశారు.
రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ప్రవర్తిస్తున్న తీరును, పార్టీ సీనియర్‌లుగా చెప్పుకుని వేదికపై వైట్ డ్రెస్‌లో కూర్చున్న వాళ్ల వల్ల కాంగ్రెస్ అధికారంలోకి రాదనే క్లారిటీని రాహుల్‌గాంధీకి చేరవేశారు. సీనియర్‌లుగా ఉన్న నేతలు చెప్పిన వాళ్లకు టిక్కెట్లు ఇస్తే ఏ ఒక్కరు గెలవరని డైరెక్టర్‌గా రాహుల్‌గాంధీకే చెప్పారు. అంతే కాదు రైతు సమస్యలపై పోరాడుతూ ప్రజల్లో తిరిగే వాళ్లకే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తామన్న రాహుల్‌గాంధీ మాటను పట్టుకొని ఇంకొక విజ్ఞప్తి చేశారు భువనగిరి ఎంపీ. మొదట్నుంచి పార్టీ కోసం కష్టపడిన వాళ్లకు సభకు పాస్‌లు కూడా ఇవ్వకపోవడం వల్లే చాలా మంది సభకు రాలేకపోయారని తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సభకు హాజరుకాకపోవడాన్ని సమర్ధించుకున్నారు.
అలాగే గత ఎన్నికల్లో జరిగినట్లుగా కాకుండా..రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎవరితో పొత్తులు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేస్తే గెలుస్తామని మాటిచ్చారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. ఈసారి ఆరు నెలల ముందే అభ్యర్ధుల్ని ఎంపిక చేయాలని కోరారు. అది కూడా పార్టీ రాష్ట్ర నాయకత్వం సిఫార్సు చేసిన వాళ్లను కాకుండా..ప్రజల్లో ఉంటూ పార్టీని బలోపేతం కోసం కృషి చేస్తున్న వాళ్లకు మాత్రమే టిక్కెట్ ఇవ్వాలని కోమటిరెడ్డి సభా వేదికగా ఆయన రాహుల్‌గాంధీని కోరారు.