భువనగిరి కలెక్టరేట్‌లో జరిగిన దిశ సమావేశంలో ఎంపీ కోమటరెడ్డి వెంకటరెడ్డి జిల్లా అధికారులపై సీరియస్ అయ్యారు. జిల్లాలో జరుగుతున్న పనులపై అధికారుల్ని ఆరా తీసిన ఆయన.. తనకు పనుల జాబితా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. జిల్లాలో 140 కోట్ల రైతు బంధు బకాయిలున్నాయని, అలాగే ధాన్యం కొనుగోలులోనూ 30% డబ్బులు చెల్లించాల్సి ఉందని, వాటిని వెంటనే చెల్లించాలని అధికారుల్ని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించకుండా చేశారని, వాటిపై పార్లమెంటరీ స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. పనుల నాణ్యత విషయంలో సరిగ్గా పట్టించుకోకపోతే ఇబ్బందులపాలవుతారని కలెక్టర్‌తో పాటు ఇతర అధికారులకు చెప్పినప్పటికీ పట్టించుకోవడం లేదని ఆగ్రహించారు.
ఇదిలావుండగా.. కాంగ్రెస్ పార్టీలో ఎర్రశేఖర్ చేరికను కోమటరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. నేర చరిత్ర ఉన్న వాళ్లను పార్టీలో ఎలా చేర్చుకుంటారంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. గాంధీ సిద్దాంతాలు నమ్మే కాంగ్రెస్ పార్టీలోకి నేరగాళ్లు వస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై తాను అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానన్నారు. నిజానికి.. ఎర్రశేఖర్ కాంగ్రెస్‌లో చేరుతున్నారనే వార్తలు వచ్చినప్పుడే ఆయన అధిష్టానానికి లేఖ రాశారు. ఎర్రశేఖర్‌ను పార్టీలో చేర్చుకోవద్దని ఆ లేఖలో కోరారు. అయితే, గీతారెడ్డి మాత్రం ఎర్రశేఖర్ చేరికను సమర్థించారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌లో అంతర్గత పోరు నెలకొంది.
