Site icon NTV Telugu

Komatireddy Rajagopal Reddy: మోటార్లకు మీటర్లు ఉంటే తప్పేంటి.. జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా

Komatireddy Rajagopal

Komatireddy Rajagopal

Komatireddy Rajagopal Reddy Comments On Meters For Motors: మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోటార్లకు మీటర్ల విషయంలో టీఆర్ఎస్ పార్టీ అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని మండిపడిన ఆయన.. అసలు మోటార్లకు మీటర్లు ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. మీటర్లు ఉన్నప్పటికీ, చార్జీలు వసూలు చేయడం లేదని ఏపీ సీఎం జగన్ చెప్పారని.. ఆయన నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని చెప్పారు. డిస్కౌమ్‌లను కాపాడుకోవడం కోసం కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. మోటార్లకు మీటర్లు పెడతామని కేంద్రం ఎక్కడ అధికారికంగా చెప్పలేదని ఆయన మరోసారి ధృవీకరించారు. ప్రభుత్వాలు తీసుకుంటున్న కొన్ని అనాలోచిత నిర్ణయాల వల్ల విద్యుత్ రంగం సంక్షోభంలోకి వెళుతోందని.. ఆ సంక్షోభం నుంచి విద్యుత్ రంగాన్ని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం సంస్కరణలు చేపట్టిందని ఆయన స్పష్టం చేశారు.

అంతకుముందు.. సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో అడుగుపెడుతున్న విషయంపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రాజగోపాల్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇంతకీ కేటీఆర్ ఏమన్నారంటే.. సృజనాత్మక కథనాలతో పుష్ప, బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలు పాన్ ఇండియా హిట్‌గా నిలిచాయని.. అలాంటప్పుడు బోల్డ్ విజన్, గంభీరమైన ఆలోచనలతో దేశ అభివృద్ధిని, భారత ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేసేందుకు కృషి చేయాలన్న కేసీఆర్ ఆలోచనల్లో తప్పేముందని అన్నారు. అంతేకాదు.. కేసీఆర్‌ని ఎవరూ అడ్డుకోలేరని, బీజేపీని ఓడించే సత్తా ఆయనకు మాత్రమే ఉందన్నారు. ఈ వ్యాఖ్యలపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందిస్తూ.. అవినీతిలో అన్ని రికార్డులు బద్దలుకొట్టే పాన్ ఇండియా స్టార్‌గా కేసీఆర్‌ని ప్రొజెక్ట్ చేయాలని ట్వీట్ చేశారు. రాష్ట్ర సంపదను కేసీఆర్ వంశం ఎలా కొల్లగొట్టిందో.. ఒక అవినీతి రాజకీయ సామ్రాజ్యాన్ని ఎలా స్థాపించిందో భారత ప్రజలు తెలుసుకోనివ్వండంటూ కౌంటర్లు వేశారు.

అలాగే.. మునుగోడు ఉపఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని రాజగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ నేతల సభలకు డబ్బులిచ్చి జనాలను తీసుకెళ్లే పరిస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు. బీజేపీ అంటే.. టీఆర్ఎస్ లాగా లక్షల కోట్లు దోచుకున్న పార్టీ కాదన్నారు. మునుగోడు ఎన్నికలపై కేసీఆర్‌కు భయం పట్టుకుందని.. కాంగ్రెస్ తమ అభ్యర్థిని ప్రకటించినా, కేసీఆర్ ఇంకా టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించలేదన్నారు. టీఆర్ఎస్‌కి అభ్యర్థి దొరక్కపోవడమే అందుకు కారణమని ఎద్దేవా చేశారు. మునుగోడులో జరిగేది ఎన్నిక కాదని.. అది ఒక ధర్మ యుద్ధమని రాజగోపాల్ రెడ్డి చెప్పారు.

Exit mobile version