Site icon NTV Telugu

Komatireddy Rajagopal Reddy: మునుగోడు నుంచే కేసీఆర్ పతనం ప్రారంభం

Komatireddy Rajagopal Reddy

Komatireddy Rajagopal Reddy

Komatireddy Rajagopal Reddy Comments On CM KCR In BJP Munugodu Meeting: మునుగోడు సమరభేరి సభ వేదికగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఆ తర్వాత సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. కేసీఆర్ పతనం మునుగోడు నుంచే ప్రారంభం అవుతుందని, మునుగోడులో ధర్మం గెలుస్తుందని అన్నారు. మోసకారి, దగా కోరు, నయవంచక కుటుంబం చేతిలో చిక్కి.. తెలంగాణ రాష్ట్రం విలవిల్లాడుతోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కుటుంబ పాలనకు వ్యతిరేకంగా యుద్దం జరుగుతోందని, నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను కేసీఆర్ అపాయింట్‌మెంట్‌ను ఎన్నిసార్లు కోరినా ఇవ్వలేదన్నారు.

మునుగోడు ఉప ఎన్నిక వ్యక్తుల మధ్య జరిగే యుద్ధం కాదని.. కేసీఆర్ అహంకారానికి, తెలంగాణ ప్రజల మధ్య జరిగే యుద్ధమని పేర్కొన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని.. ప్రజలు చారిత్రక తీర్పు ఇచ్చి టీఆర్ఎస్‌ను బొందపెట్టాలని పిలుపునిచ్చారు. పార్టీలు మారేటప్పుడు చాలామంది నేతలు నైతిక విలువల్ని వదిలేస్తున్నారని, కానీ తాను మాత్రం పదవికి రాజీనామా చేసి మరీ బీజేపీలో చేరానని అన్నారు. తాను అమిత్ షాను కలిసినప్పటి నుంచి కేసీఆర్‌కు నిద్రపట్టడం లేదన్నారు. అందుకే.. మోటార్లకు మీటర్లు పెడతారని కేసీఆర్ అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో పాలన అవినీతిమయంగా మారింది.. కేసీఆర్ దోచుకున్నదంతా కక్కిస్తామని రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు.

ప్రజల మీద విశ్వాసంతోనే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని, తనను గెలిపించిన ప్రజలకు న్యాయం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. రాష్ట్రం అప్పుల పాలైందని, మన పిల్లల భవిష్యత్ కోసం మోదీ, అమిత్ షా నాయకత్వంలో పని చేద్దామని అన్నారు. ఉద్యమకారులందరూ మరోసారి ఉద్యమానికి సిద్ధంకండని పిలుపునిచ్చారు. బీజేపీ సభను దెబ్బతీసేందుకే కేసీఆర్ నిన్న సభ పెట్టారని.. కానీ అభ్యర్థి పేరు చెప్పకుండా సభ ముగించారని అన్నారు. కేసీఆర్‌కు దమ్ము, ధైర్యం లేదని ఆరోపించారు. కేసీఆర్‌ను గద్దె దింపి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాల్సిన అవసరం ఉందని రాజగోపాల్ అభిప్రాయపడ్డారు.

Exit mobile version