Site icon NTV Telugu

Kodanda Reddy: బీజేపీ, టీఆర్ఎస్ మధ్య లాలూచీకి ఇదే ప్రత్యక్ష సాక్ష్యం

Kodanda Reddy On Kavitha

Kodanda Reddy On Kavitha

Kodanda Reddy Demands Kavitha To Prove Her Honesty: బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య లాలూచీ కొనసాగుతోందని చెప్పడానికి తాజా పరిణామాలే ప్రత్యక్ష సాక్ష్యమని కాంగ్రెస్ సీనియర్ నేత కోదండ రెడ్డి అభిప్రాయపడ్డారు. మునుగోడు సభలో కాళేశ్వరం ప్రాజెక్ట్ సీఎం కేసీఆర్‌కు ఏటీఎంలా మారిందని అన్నారని, మరి హోంమంత్రి స్థాయిలో ఉన్న మీరు విచారణ సంస్థలతో ఎందుకు విచారణ జరిపించడం లేదని ప్రశ్నించారు. అలాగే.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవిత ముఖ్యపాత్ర పోషించారని ఆధారాలతో సహా వార్తలొస్తున్నాయని, కేంద్రంలో అధికారంలో ఉన్న మీరు చర్యలు తీసుకోవడం మానేసి కేవలం కవిత ఇంటి ముందు ధర్నాలతో కానిచ్చేస్తున్నారని చెప్పారు. కేంద్రంలో ఉండి కూడా చర్యలు తీసుకోకపోవడాన్ని చూస్తుంటే.. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య లాలూచీ ఉన్నట్టు స్పష్టమవుతోందని కోదండ రెడ్డి తెలిపారు.

కుంభకోణం జరిగిందని చెప్తోన్న మోదీ ప్రభుత్వం, ఆ వివరాల్ని బహిర్గతం చేయాలని కోదండ రెడ్డి కోరారు. అలాగే.. లిక్కర్ కుంభకోణంలో తన పాత్ర ఉందని వస్తున్న వార్తల్లో నిజం లేదని కవిత నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలను ఇంటికి పిలిపించి బలం చూపించుకోవడం కాదని.. ఆరోపణలు వచ్చినప్పుడు నిరూపించుకోవడానికి రెడీగా ఉండాలని అన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఆరోపణలు వచ్చినప్పుడు.. చట్టసభల్లోనే రాజీనామా చేసేవారన్నారు. విలువలు గల కాంగ్రెస్ ప్రజలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. బతుకమ్మను రాజకీయం చేస్తున్నారని.. కవిత అధునాతన బతుకమ్మగా మారిందని ఎద్దేవా చేశారు. కవితను బతుకమ్మతో పోల్చిన మాటల్ని ఉపసంహరించుకోవాలని.. లేకపోతే తెలంగాణ మహిళలు ఉపేక్షించరని కోదండ రెడ్డి హెచ్చరించారు.

Exit mobile version