ఆర్థిక ఇబ్బందులు ఏ ఒక్క పేద విద్యార్థి చదువుకు ఆటంకం కాకూడదనే సదుద్దేశంతో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న పేద విద్యార్థులకు అండగా నిలుస్తూ, వారందరి పరీక్షా ఫీజులను స్వయంగా చెల్లించారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న మొత్తం 87 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 4,741 మంది టెన్త్ విద్యార్థుల పరీక్షా ఫీజుల భారాన్ని ఆయన పూర్తిగా మోశారు. తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడకుండా, విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరీక్షలపై దృష్టి సారించేందుకు ఆయన తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
అంగన్వాడీల నుంచి ప్రభుత్వ పాఠశాలల వరకు మౌలిక వసతుల కల్పన
విద్యాభివృద్ధితోనే సమాజ వికాసం సాధ్యమని బలంగా విశ్వసించే కిషన్ రెడ్డి, గతంలో అంబర్‌పేట ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచే విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని పేద విద్యార్థుల చదువుకు ఏటా బాసటగా నిలుస్తూనే, ప్రభుత్వ పాఠశాలలు , అంగన్వాడీ కేంద్రాల బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా విద్యార్థులకు బూట్లు, దుస్తులు, నోట్‌బుక్స్ అందించడంతో పాటు పాఠశాలల్లో బెంచీలు, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్ల నిర్మాణం , వాటి పరిశుభ్రత కోసం టాయిలెట్ క్లీనింగ్ మిషన్లు వంటి ఆధునిక మౌలిక వసతులను కల్పిస్తున్నారు.
చిన్నారుల ప్రాథమిక విద్యకు పునాది అయిన అంగన్వాడీ కేంద్రాలను సైతం ఆహ్లాదకరమైన, ఆధునిక వసతులతో ఆయన తీర్చిదిద్దుతున్నారు. ఒకవైపు పేద విద్యార్థులకు పరీక్షా ఫీజులు చెల్లిస్తూ, మరోవైపు పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరుస్తూ వారి బంగారు భవిష్యత్తుకు కిషన్ రెడ్డి నిరంతరం అండగా నిలుస్తున్నారని స్థానిక ప్రజలు, ఉపాధ్యాయులు , విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశంసిస్తున్నారు.

