Site icon NTV Telugu

Kishan Reddy: ‘లిబరేషన్ డే’ను తొక్కిపెట్టారు.. బీజేపీ 25 ఏళ్లుగా డిమాండ్ చేస్తోంది

Kishan Reddy Liberation Day

Kishan Reddy Liberation Day

Kishan Reddy Gives Details About Telangana Liberation Day: లిబరేషన్ డే నిర్వహించాలని బీజేపీ 25 ఏళ్లుగా డిమాండ్ చేస్తూనే ఉందని, కానీ దాన్ని తొక్కి పెట్టారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎట్టకేలకు ఇన్నాళ్ల తర్వాత కేంద్రంలోని బీజేపీ ఈ విమోచన దినోత్సవానికి బీజం వేసిందన్నారు. హైదరాబాద్ విమోచన ఉత్సవాలను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రారంభిస్తారని, ఏడాది పొడవునా ఈ కార్యక్రమాలు మూడు రాష్ట్రాల్లో (తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర) జరుగుతాయని అన్నారు. హైదరాబాద్ నుండి విడిపోయి మహారాష్ట్ర, కర్ణాటకలో కలిసిన ప్రాంతంలో సెప్టెంబర్ 17న ‘ముక్తి దివస్’ జరుగుతుందని.. తెలంగాణలో మాత్రం అది నిర్వహించలేదని తెలిపారు. తాను మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశానని.. ఎంపీలు, ఎమ్మెల్యేలను సైతం ఆహ్వానించానని చెప్పారు.

గతంలో ఆగస్టు 15, జనవరి 26 కార్యక్రమాలు జరిగిన పెరేడ్ గ్రౌండ్‌లోనే హైదరాబాద్ విమోచన దినోత్సవం జరుగుతుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అమర జవాన్ స్మారక స్థూపానికి, సర్దార్ పటేల్ చిత్రపటానికి అమిత్ షా నివాళులు అర్పిస్తారన్నారు. పారామిలిటరీ కవాతులో 12 బృందాలు పాల్గొంటాయని, ఇందులో రెండు మహిళా బృందాలుంటాయని వెల్లడించారు. కేంద్ర సాంస్కృతిక శాఖ కళా బృందాల ప్రదర్శన ఉంటుందని.. కర్ణాటక, మహారాష్ట్ర కళాకారులు ఇందులో పాల్గొంటారని అన్నారు. నాదస్వరంతో ఈ కార్యక్రమం మొదలవుతుందన్నారు. స్వతంత్ర సమరయోధులకు, మిలిటరీ వారికి సన్మానం ఉంటుందని పేర్కొన్నారు. ఉదయం సర్దార్ పటేల్ విగ్రహానికి మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పూలమాల వేసి నివాళులు అర్పిస్తారని.. మధ్యాహ్నం ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు జరగనున్నాయని, ఈ వేడుకలకి అమిత్ షా పాల్గొంటారని క్లారిటీ ఇచ్చారు.

హైదరాబాద్ విమోచన కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరవుతారా? లేదా? అనే విషయంపై తెలంగాణ ప్రభుత్వం నుంచి తమకు ఇంకా ఎలాంటి సమాచారం అందలేదని కిషన్ రెడ్డి అన్నారు. మహారాష్ట్ర సీఎం మాత్రం తప్పకుండా హాజరవుతారన్నారు. కర్ణాటక రాయచూర్‌లో అక్కడి ప్రభుత్వం వేడుకలు నిర్వహిస్తోందని, అక్కడి సీఎం ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నారని చెప్పారు. అది పూర్తయ్యాక ఇక్కడికి వస్తారన్నారు. కర్ణాటక మంత్రులు సైతం హాజరవుతాయని వెల్లడించారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత విమోచన దినోత్సవం చేస్తామని మాటిచ్చారని, ఇన్నాళ్లు మౌనంగా ఉండి ఇప్పుడు పేరు మార్చారన్నారు. పేరు ఏదైనా.. రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహించడం, తెలంగాణ ప్రజల విజయమేనని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

Exit mobile version