Site icon NTV Telugu

Kishan Reddy: సెల్‌ఫోన్ ట్యాప్ చేస్తున్నారు.. ఈటెలపై కుట్ర జరుగుతోంది

Kishan Reddy On Incident

Kishan Reddy On Incident

Kishan Reddy Fires On Etela Rajender Attack Incident: పలివెలలో జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. కొన్ని రోజుల నుంచి ఈటెల రాజేందర్‌పై కక్ష సాధింపు జరుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతల సెల్‌ఫోన్‌లను ట్యాప్ చేయడంతో పాటు కుట్రలు జరుగుతున్నాయన్నారు. బీజేపీ గెలుపు కోసం పనిచేస్తున్న ఈటల మొహం చూడొద్దని.. అసెంబ్లీకి కూడా రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. అసెంబ్లీలో శాసనసభ్యులను సివిల్ పోలీసులు అరెస్ట్ చేయడం చరిత్రలో జరగలేదన్నారు. ఎన్నికల ప్రచారం కోసం పలివెల గ్రామానికి వెళ్తే.. అక్కడ ఈటెలపై దాడులకు దిగారని, పక్కా ప్లాన్‌తో ఆ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. పలివెలలో ఓట్లు రావని, మునుగోడులో ఓటమి తప్పదన్న భయంతోనే.. టీఆర్ఎస్ నేతలు ఇలా బస్తాల్లో రాళ్లు నింపుకుని తిరుగుతున్నారని విమర్శించారు.

ఇటీవల టీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి తన అనుచరులతో కలిసొచ్చి.. తన సభను కూడా అడ్డుకున్నారని కిషన్ రెడ్డి భగ్గుమన్నారు. ఇప్పుడు ఈటెల కాన్వాయ్‌పై దాడికి దిగారని.. డీసీఎం వ్యాన్లలో రాళ్లు, కర్రలు తెచ్చుకుని మరి దాడి చేశారని చెప్పారు. ఇంత జరిగినప్పటికీ.. గొడవ జరగొద్దనే ఉద్దేశంతోనే ఈటల సంయమనం పాటించి, అక్కడి నుంచి వచ్చేశారన్నారు. టీఆర్ఎస్ అధికార దుర్వినియోగాన్ని ప్రజలు గమనిస్తున్నారని.. హుజూరాబాద్ ఫలితంతో టీఆర్ఎస్ కాలుకాలిన పిల్లిలా తయారైందని ఎద్దేవా చేశారు. పోలీసులు సైతం టీఆర్ఎస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు చేశారు. ఎన్ని దాడులు చేసినా తాము భయపడమని తేల్చి చెప్పారు. ఎన్నికల సమయంలో బీజేపీ నేతల కార్లను తనిఖీ చేస్తున్నారని, టీఆర్ఎస్ నేతల కార్లను మాత్రం వదిలేస్తున్నారని.. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. దాడి చేసినవాళ్లను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. నవంబర్ 3వ తేదీన మునుగోడు ప్రజలు సీఎం కేసీఆర్‌కు తగిన బుద్ధి చెప్తారని కిషన్ రెడ్డి చెప్పారు.

మరోవైపు.. ఈ దాడులపై ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, మునుగోడు ఉపఎన్నికలో గెలవరనే భయంతోనే టీఆర్ఎస్ తమపై దాడులకు పాల్పడుతోందన్నారు. పలివెల గ్రామంలో టీఆర్ఎస్‌కు బేస్ కూడా లేదని, తమని ఎదుర్కొనే దమ్ము లేకే ఇలాంటి భౌతిక దాడులకు ఎగబడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ గుండాయిజానికి తాము భయపడమని, పక్కా ప్లాన్‌తోనే ఈ దాడి చేశారన్నారన్నారు. మునుగోడు ప్రజల తీర్పుతో టీఆర్ఎస్ చెంప ఛెళ్లుమనడం ఖాయమని తెలిపారు.

Exit mobile version