Khelo India : భారత క్రీడారంగాన్ని అంతర్జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం బృహత్తర ప్రణాళికను సిద్ధం చేసింది. ‘ఖేలో ఇండియా’ పథకం 2026-31 కాలపరిమితికిగాను ఏకంగా రూ. 36,441 కోట్ల నిధులను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. గతంతో పోలిస్తే ఈ వ్యయం దాదాపు 8 రెట్లు పెరగడం గమనార్హం. ప్రస్తుతం శిక్షణ పొందుతున్న అథ్లెట్ల సంఖ్యను 10 రెట్లు పెంచడమే లక్ష్యంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) డిప్యూటీ డైరెక్టర్ హిమ బిందు ఆధ్వర్యంలో ఈ ప్రతిష్టాత్మక ప్రణాళికలు రూపుదిద్దుకున్నాయి.
క్రీడా మౌలిక సదుపాయాలు , నిధుల కేటాయింపు
ఈ పథకం కింద స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రతిభ గుర్తింపు, అధునాతన కోచింగ్ , స్పోర్ట్స్ టెక్నాలజీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒలింపిక్స్, ఆసియా గేమ్స్, కామన్వెల్త్ క్రీడల్లోని 30 కీలక విభాగాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో నిధులను పంచుకుంటాయి. ప్రస్తుతం ఉన్న క్రీడా సదుపాయాలను మ్యాపింగ్ చేసి, అవసరమైన చోట కొత్త ఫెసిలిటీస్ ఏర్పాటుకు గ్యాప్ , గ్రాంట్ అనాలిసిస్ ద్వారా నిధులు కేటాయిస్తారు. అంతేకాకుండా స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలతో పాటు జోనల్ స్థాయిలో ఖేలో ఇండియా యూత్, యూనివర్సిటీ, పారా, వింటర్ గేమ్స్‌తో పాటు బీచ్, ట్రైబల్, వాటర్ స్పోర్ట్స్ ఈవెంట్లను కూడా బలోపేతం చేయనున్నారు.
ఏఐ టెక్నాలజీతో ప్రతిభ వేట , అథ్లెట్లకు సంపూర్ణ సంరక్షణ
దేశవ్యాప్తంగా ఉన్న 10 ఖేలో ఇండియా ఉన్నత పాఠశాలలు, 500 ఖేలో ఇండియా కేంద్రాల ద్వారా ప్రమాణీకృత పద్ధతిలో ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తిస్తారు. ఇందులో భాగంగా క్రీడల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) , వీడియో ఆధారిత సాంకేతికత ద్వారా అథ్లెట్ల ప్రతిభను, పనితీరును డేటా ఆధారంగా విశ్లేషిస్తూ వారి కెరీర్ మొత్తాన్ని డిజిటల్‌గా ట్రాక్ చేస్తారు. 30 క్రీడా విభాగాల్లో 10 వేల మంది ఖేలో ఇండియా క్రీడాకారులకు, మరో 20 వేల మంది వర్ధమాన అథ్లెట్లకు ఉచిత శిక్షణ అందిస్తారు. అథ్లెట్లకు వసతి, ఆహారం, కిట్లు, ప్రయాణ సౌకర్యాలతో పాటు వైద్యం, ఫిజియోథెరపీ, న్యూట్రిషనిస్ట్ , మానసిక ఆరోగ్య నిపుణుల సేవలను అందిస్తారు. సమాజంలో కమ్యూనిటీ ఫిట్‌నెస్ హబ్‌లను ఏర్పాటు చేస్తూ యోగా, దేశీయ క్రీడలు, మహిళలు , దివ్యాంగుల భాగస్వామ్యాన్ని మరింత ప్రోత్సహించనున్నారు.
‘నేను ప్రౌడ్ గవర్నమెంట్ ప్రొడక్ట్’: అంతర్జాతీయ బ్యాడ్మింటన్ స్టార్ జ్వాలా గుత్తా
ఈ సందర్భంగా ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాలా గుత్తా మాట్లాడుతూ ప్రభుత్వ ప్రోత్సాహంపై హర్షం వ్యక్తం చేశారు. తానే ఒక ప్రౌడ్ గవర్నమెంట్ ప్రొడక్ట్ అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నానని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం , తల్లిదండ్రుల ప్రోత్సాహం లేకపోతే తాను ఈ స్థాయికి వచ్చేదాన్ని కాదని పేర్కొన్నారు. ప్రతి అథ్లెట్ విజయంలోనూ ప్రభుత్వ పాత్ర ఎంతో కీలకమని ఆమె వ్యాఖ్యానించారు.
ప్రత్యేకించి కోచ్‌ల కోసం చేపడుతున్న కార్యక్రమాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని ఆమె అన్నారు. ఒక మంచి కోచ్ ఉంటే అతని వెనుక ఎంతోమంది ప్రతిభావంతులైన క్రీడాకారులు తయారవుతారని, అందుకే కోచ్‌లకు తగిన గుర్తింపు, ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్తులో విదేశీ శిక్షకుల అవసరం లేని స్థాయికి భారతదేశం ఎదగాలని, హిమ బిందు నేతృత్వంలో జరుగుతున్న ఈ గొప్ప ప్రాజెక్ట్‌లో భాగస్వామి కావడం చాలా ఆనందంగా ఉందని జ్వాలా గుత్తా తెలిపారు.

