NTV Telugu Site icon

గంజాయి సరఫరాలో ఇద్దరు కానిస్టేబుళ్ల పాత్ర.. రూ.5 కోట్ల డీల్

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో గంజాయి సరఫరా హాట్‌టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో గంజాయి సరఫరాలో పోలీసులే కీలక పాత్ర పోషిస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. రూ.5 కోట్ల విలువైన గంజాయి సరఫరాకు ముందస్తుగా 5 కిలోలు తీసుకుని వచ్చినట్లు సమాచారం. దీని కోసం ఇద్దరు ఏఆర్ కానిస్టేబుళ్లు సతీష్, వెంకట్ గంజాయి సరఫరా దారులకు మద్దతు ఇచ్చారన్న సమాచారం వెలుగు చూసింది. 5 కిలోల గంజాయిని భద్రాచలం నుంచి హైదరాబాద్‌కు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.

Read Also: వైర‌ల్‌: పెట్రోల్ లేకుండానే ప‌రుగులు తీస్తున్న బైక్‌

గంజాయి సరఫరాలో కానిస్టేబుళ్ల సహకారాన్ని తీసుకున్నట్లు విచారణ సందర్భంగా నిందితులు వెల్లడించారు. దీంతో పోలీసులు ఆ కానిస్టేబుళ్ల పాత్రపై విచారణ చేపట్టారు. కాగా కొద్దిరోజుల క్రితం కూడా గంజాయి సరఫరాలో రైల్వే కానిస్టేబుల్ పాత్ర ఉన్న విషయం కూడా వెలుగు చూసింది. ప్రస్తుతం 5 కిలోల గంజాయి పట్టుపడినట్లు జిల్లా సీపీ విష్ణు వారియర్ వెల్లడించారు. అయితే విచారణ జరుగుతోందని, దీంతో ఈ కేసులో మరిన్ని విషయాలు బహిర్గతం అవుతాయని ఆయన చెబుతున్నారు.