Khammam: స్థానిక పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఖమ్మం జిల్లాలోని హర్యా తండాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పంచాయతీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన మాలోతు రంగా అనే వ్యక్తి వినూత్నంగా నిరసన తెలియజేశారు. ఎన్నికల్లో ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయిన ఆయన, నిరసన వ్యక్తం చేస్తూ ఏకంగా సెల్ టవర్ ఎక్కారు. సెల్ టవర్ పై నుంచి మాలోతు రంగా మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలుపు కోసం తాను భారీగా ఖర్చు పెట్టానని, అయితే తమ ప్రత్యర్థి పార్టీ వారు రిగ్గింగ్‌కు పాల్పడి అక్రమంగా విజయం సాధించారని తీవ్రంగా ఆరోపించారు. మాలోతు రంగా సెల్ టవర్ పై నుంచి కిందకు దిగేందుకు ససేమిరా అంటుండటంతో హర్యా తండాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. స్థానికుల సమాచారంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఓటమి చెందిన అభ్యర్థిని సురక్షితంగా కిందకు దింపేందుకు పోలీసులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.
Khammam: ఎన్నికల్ల ఓటమి.. సెల్ టవర్ ఎక్కి నిరసన..!
- ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థి సెల్ టవర్ ఎక్కి నిరసన
- రిగ్గింగ్ ఆరోపణలతో మాలోతు రంగా ఆగ్రహం
- హర్యా తండాలో ఉద్రిక్తత, పోలీసులు రంగంలోకి
- అభ్యర్థిని కిందకు దింపేందుకు పోలీసులు ప్రయత్నాలు

Khammam