KCR To Modi: తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో ప్రెస్ మీట్ నిర్వహించి ప్రధాని మోడీపై ప్రశ్నల వర్షం కురిపించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై నిప్పులు చెరిగారు. నీతి ఆయోగ్ సమావేశంలో నాలుగు గంటల పాటు కూర్చొని నాలుగు నిమిషాలు మాట్లాడమంటే ఎలా అని అన్నారు. టైం పాస్ కోసం పల్లీలు, బిస్కెట్లు, అవీ ఇవీ తింటూ కూర్చోవాలా అని ఎద్దేవా చేశారు. ”అక్కడ మాట్లాడితే ఎలాగూ పట్టించుకోరని ఇక్కడి నుంచే మాట్లాడుతున్నా. ఈ రకంగానైనా నేను నీతి ఆయోగ్ మీటింగ్‌ను ఎందుకు బహిష్కరించానో దేశం చర్చించుకుంటుంది.
నాకు కావాల్సింది అదే. కేంద్ర ప్రభుత్వం తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కుంటోంది. 5జీ స్పెక్ట్రం ఒక కుంభకోణం. 5 లక్షల కోట్లు అంచనా వేస్తే లక్షన్నర కోట్లే రావటమేంటి? పాలు, చేనేతలు, స్మశానాల మీద జీఎస్టీ వేయొద్దు. ఉపాధి హామీ పథకాన్ని ఎత్తేయాలని చూస్తున్నారు. అది సరికాదు. రాహుల్.. నువ్వు నా ఫ్రెండ్ అయినా ఇవాళ నువ్వు అడిగే ఏ ప్రశ్నలకూ సమాధానం చెప్పదల్చుకోలేదు. నిన్ను డిజప్పాయింట్ చేసినందుకు సారీ. రేపు మళ్లీ మీడియా ముందుకు వస్తా. అప్పుడు మీరు అడిగే ప్రశ్నలన్నింటికీ జవాబులు చెబుతా.
మోడీ నా ఫ్రెండ్. అయినా దేశం కోసం ఆయన్ని ప్రశ్నిస్తూనే ఉంటా. నా ప్రాణం ఉన్నంత వరకు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. కేంద్ర ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను సర్వ నాశనం చేస్తోంది. పీఎస్‌యూలు తీసుకునే లోన్లను కూడా రాష్ట్ర ప్రభుత్వ అప్పులుగానే పరిగణనలోకి తీసుకుంటామంటే ఎట్లా? నేను మొన్న ఢిల్లీకి వెళ్లి 5 రోజులు కూర్చొని ఎఫ్‌ఆర్‌బీఎం గురించి కేంద్రాన్ని నిలదీసిన. దీంతో దెబ్బకు దిగొచ్చింది. ఎఫ్‌ఆర్‌బీఎం పేరిట విధించిన కోతలను ఎత్తేయాలి. లేకపోతే రాష్ట్రాలు డెవలప్ కాలేవు. బలమైన రాష్ట్రాలు ఉంటేనే బలమైన భారతదేశం ఉంటుంది.
నిజమైన సమాఖ్య స్ఫూర్తిని పాటించండి. మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. మోడీతో నాకు వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలూ లేవు. మోడీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే నేను ఊరుకోను. ఇప్పుడు మాటలు రూపంలో అడుగుతున్నాం. వినకపోతే భవిష్యత్తులో ఉద్యమాలు చేస్తాం. పాత ప్రభుత్వాలు పెట్టిన సంక్షేమ పథకాలను చెరిపివేసే కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. కేసీఆర్‌ని తిట్టి పబ్బం గడుపుకుంటామంటే కుదరదు.
నేను మాట్లాడుతున్న ఈ మాటలు చరిత్రలో నిలిచిపోతాయి. 5జీ స్పెక్ట్రం వెనకున్న మతలబేంది? ఆ రోజు 2జీ మీద ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. మరి ఇవాళ మీరు చేసిందేంటి?. మేకిన్ ఇండియా అంటున్నారు. మన దేశ జెండాలను, గడ్డం గీసుకునే బ్లేళ్లను కూడా చైనా నుంచి దిగుమతి చేసుకుంటే ఇక మేకిన్ ఇండియా ఎందుకు? కేంద్ర ప్రభుత్వ వైఖరిలో ఇప్పటికైనా మార్పు రావాలి’ అని సీఎం కేసీఆర్ కోరారు.
