దశాబ్దాలుగా మావోయిస్టులకు సురక్షిత ప్రాంతంగా, వారి ఆయుధ కర్మాగారాలకు , ముఖ్య నాయకులకు షెల్టర్ జోన్‌గా ఉన్న ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని కర్రెగుట్ట అటవీ ప్రాంతం ఇప్పుడు పోలీసుల అధీనంలోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న మావోయిస్టు రహిత భారత్ లక్ష్యంలో భాగంగా, వెంకటాపురం మండలం పామునూరు గ్రామ పరిధిలోని కర్రెగుట్టలపై నూతనంగా ఎఫ్.ఓ.బి (FOB) బేస్ క్యాంప్‌ను అధికారులు ప్రారంభించారు.
సి.ఆర్.పి.ఎఫ్ (CRPF) 39వ బెటాలియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ బేస్ క్యాంప్‌ను సి.ఆర్.పి.ఎఫ్ ఐజీ త్రివిక్రమ్ (IPS) రిబ్బన్ కట్ చేసి అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇది దేశ భద్రతా చరిత్రలో ఒక గొప్ప రోజని అభివర్ణించారు. తెలంగాణ ప్రభుత్వ చొరవతో, మురుమూరు బేస్ క్యాంప్ ఏర్పాటు చేసిన కేవలం రెండు నెలల వ్యవధిలోనే దుర్భేద్యమైన కర్రెగుట్టలపై పట్టు సాధించి ఈ రెండో క్యాంప్‌ను ఏర్పాటు చేయడం విశేషమని ఆయన కొనియాడారు.
Teena Sravya: సమ్మక్క సారలమ్మలను ఘోరంగా అవమానించిన టాలీవుడ్ హీరోయిన్?
ఈ బేస్ క్యాంప్ ఏర్పాటు వెనుక అధికారుల , ఇంజనీర్ల అలుపెరగని కృషి దాగి ఉంది. వాజేడు మండలం మొరుమూరు బేస్ క్యాంప్ నుండి కర్రెగుట్టల వరకు సుమారు 8.3 కిలోమీటర్ల మేర దట్టమైన అటవీ ప్రాంతంలో రహదారిని నిర్మించారు. భారీ యంత్రాలు, క్రైన్‌ల సహాయంతో గుట్టలపై విశాలవంతమైన రహదారిని నిర్మించడానికి అధికారులు సుమారు 50 రోజుల పాటు అహోరాత్రులు శ్రమించారు. ఈ రహదారి నిర్మాణం పూర్తి కావడంతో ఇప్పుడు బలగాల రాకపోకలు సులభతరం కావడమే కాకుండా, మావోయిస్టుల కదలికలకు అడ్డుకట్ట పడింది.
బేస్ క్యాంప్ ప్రారంభం అనంతరం ఐజీ విక్రమ్ పామునూరు గ్రామస్తులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రానున్న రోజుల్లో జెల్లా, డోలి, తడపాల మీదుగా మరిన్ని రహదారులు నిర్మించి బేస్ క్యాంప్‌లను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. మావోయిస్టుల ముఖ్య క్యాడర్ ఇప్పటికే లొంగిపోయారని, ప్రస్తుతం కొన్ని చిన్న పార్టీలు మాత్రమే మిగిలి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. వారు కూడా తెలంగాణ పోలీసులు పిలుపునిచ్చిన “పోరు కన్నా ఊరు మిన్న” కార్యక్రమం ద్వారా లొంగిపోయి, ప్రభుత్వం కల్పిస్తున్న పునరావాసాన్ని అందిపుచ్చుకుని జనజీవన స్రవంతిలో కలవాలని ఆయన పిలుపునిచ్చారు.
కర్రెగుట్టల నుంచి పలు గ్రామాల దిశగా రహదారి పనులు చకచకా సాగుతుండటంతో స్థానిక గిరిజన గ్రామాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు ప్రభుత్వ పథకాలు నేరుగా తమ దరికి చేరుతాయని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల రాకతో భద్రతా భావం పెరిగిందని, కర్రెగుట్టలు ఇకపై మావోయిస్టుల స్థావరాలుగా కాకుండా అభివృద్ధికి కేంద్రాలుగా మారుతాయని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Bheems Ceciroleo: సౌండ్ ఆఫ్ ఫెస్టివల్.. సంక్రాంతి సినిమాలకు ప్రాణం పోస్తున్న భీమ్స్ సిసిరోలియో!
