Site icon NTV Telugu

Crypto Currency Scam: నకిలీ క్రిప్టో కరెన్సీ కేసులో మాజీ కార్పొరేటర్ అరెస్ట్.. ఏ పార్టీ అంటే..?

Karimnagar

Karimnagar

Crypto Currency Scam: క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే మూడింతలు లాభాలు వస్తాయని నమ్మించి ప్రజలను మోసం చేసిన ప్రధాన నిందితులలో మాజీ కార్పొరేటర్ కట్ల సతీష్‌ను కరీంనగర్ రూరల్ పోలీసులు ఇవాళ ( సెప్టెంబర్ 12న) అరెస్టు చేశారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ ఆదేశాల మేరకు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే, వివరాల్లోకి వెళితే.. తీగలగుట్టపల్లికి చెందిన నున్సావత్ భాస్కర్ అనే వ్యక్తి నిన్న ( సెప్టెంబర్ 11న) కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కోతిరాంపూర్ కు చెందిన మాజీ కార్పొరేటర్ కట్ల సతీష్ తనకు పరిచయస్తుడని, అతను ‘మెటా ఫండ్ క్రిప్టో’ అనే స్కీమ్‌లో పెట్టుబడి పెట్టమని తనకు ఆశ చూపించాడని ఆ కంప్లైంట్ లో పేర్కొన్నారు. ఈ స్కీమ్‌లో రూ. 50 లక్షలు పెట్టుబడి పెడితే మూడింతలు లాభాలు వస్తాయని సతీష్ నమ్మించాడు.. ఆయన మాటలు నమ్మి, గత (2024) సంవత్సరం జూన్ నెలలో రూ. 15 లక్షలను సతీష్‌కు ఇచ్చా.. అలాగే, చాలా మందిని ఈ పథకంలో చేరిస్తే ఎక్కువ లాభాలు వస్తాయని సతీష్ చెప్పడంతో.. తనకు పరిచయస్తులైన మరో 17 మందిని కూడా ఈ స్కీమ్‌లో చేర్చాడు భాస్కర్.

Read Also: Health Tips: వేరుశెనగలు, ఆవాలు, నువ్వులు.. ఏ నూనె ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది?

ఇక, ఆ 17 మంది ద్వారా గత (2024) సంవత్సరం జూన్ నెలలో సతీష్ మొత్తం రూ. 1.20 కోట్లు వసూలు చేశాడు. ఈ మొత్తానికి మూడు నెలల్లో మూడింతలు లాభాలు ఇస్తానని వారికి హామీ ఇచ్చాడు. కానీ, ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా తిరిగి ఇవ్వలేదని బాధితులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. సతీష్ ను అడిగినప్పుడు డబ్బులు ఇవ్వకుండా బెదిరించాడని ఆరోపించారు. దీనిపై కరీంనగర్ రూరల్ ఇన్‌స్పెక్టర్ ఏ. నిరంజన్, సీసీఎస్ సీఐ ప్రకాష్, రూరల్ ఎస్‌ఐలు నరేష్, తిరుపతితో కలిసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే, సతీష్ దగ్గర నుంచి ఒక ఐపాడ్, రెండు మొబైల్ ఫోన్లతో పాటు కొన్ని బ్యాంక్ అకౌంట్ వివరాలను హస్తగతం చేసుకున్నారు. ఇక, సతీష్‌ను కోర్టు హాజరుపర్చి.. అనంతరం రిమాండ్‌కు తీసుకెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. అలాగే, ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామన్నారు.

Exit mobile version