Karimnagar: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని ఎలాబోతారం గ్రామానికి చెందిన రైతు మేకల మహిపాల్ రెడ్డి తనకు ఉన్న రెండు ఎకరాల భూమిలో మొక్కజొన్న పంటను సాగు చేస్తున్నాడు. అయితే, పంట పొలంలోకి తరచుగా కోతులు చొరబడి పంటను నాశనం చేయడం ప్రారంభించాయి. దీంతో కోతుల బెడదను తగ్గించుకోవాలని ఆ రైతు తీవ్రంగా ఆలోచించాడు. ఈ క్రమంలోనే హుజురాబాద్‌లోని ఒక ఎలక్ట్రికల్ షాపులో పెద్ద శబ్ధం వినిపించే ప్రత్యేక పరికరాన్ని కొనుగోలు చేశాడు. దానిని పంట పొలం పక్కన అమర్చి కోతుల బెడదను నియంత్రించగలిగాడు. ఈ పరికరం ద్వారా జంతువులు పంట పొలం దరిచేరకుండా కాపాడుకోవడం సాధ్యం అవుతుందని రైతు మహిపాల్ రెడ్డి వెల్లడించారు.
Read Also: Sexual harassment : మైనర్ విద్యార్థినిపై హాస్టల్ యజమాని లైంగిక వేధింపులు!
ఇక, రైతు మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ పరికరంలో పలు రకాల శబ్ధాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.. దీన్ని బ్లూటూత్ ద్వారా కూడా కనెక్ట్ చేసుకోవచ్చని చెప్పుకొచ్చాడు. యూ అండ్ ఐ అనే కంపెనీ తయారు చేసిన ఈ పరికరంతో చాలా వరకు కోతులు, ఇతర జంతువులు పంటకు దగ్గర కావడం లేదన్నాడు. ప్రస్తుతం ఈ పరికరంలో ఏనుగు అరుపులను రికార్డు చేసి ఉంచాను.. ఆ సౌండ్స్ వినిపించడంతో పంట పొలం చుట్టుపక్కల ప్రాంతాలకు జంతువులు రావడానికి భయపడుతున్నాయని తెలిపాడు. దీంతో తన పంటను సురక్షితంగా కాపాడుకుంటున్నానని ఆ రైతు ఆనందం వ్యక్తం చేశాడు.
