NTV Telugu Site icon

కమాన్ కారు ప్రమాదం ఘటనలో నిందితులు అరెస్ట్

కరీంనగర్ కమాన్ కారు ప్రమాదం ఘటనలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా కరీంనగర్ సీపీ సత్యనారాయణ మాట్లాడుతూ.. కరీంనగర్ కమాన్ సెంటర్ వద్ద జరిగిన యాక్సిడెంట్ మైనర్ల నిర్వాకమేనని ఆయన స్పష్టం చేశారు. కారు డ్రైవ్ చేసింది మైనర్ బాలుడు అతనితో పాటు మరో ఇద్దరు మైనర్లు ఉన్నారని కారు యజమాని కచ్చకాయల రాజేంద్రప్రసాద్ కొడుకే ప్రధాన నిందితుడని ఆయన వెల్లడించారు. మైనర్ తొమ్మిదోవ తరగతి చదువుతున్నాడని, మరో ఇద్దరు మైనర్లు పదవ తరగతి చదువుతున్నారని ఆయన తెలిపారు. వ్యవసాయ ఆధార పనిముట్లు చేస్తున్న వీధి వ్యాపారులుపై అతివేగంతో కారు వెళ్ళందని, దీంతో ఈ ఘటనలో నలుగురు మహిళలు మృతి చెందినట్లు ఆయన పేర్కొన్నారు.

తండ్రి రాజేంద్రప్రసాద్ తనే డ్రైవ్ చేసినట్టు నమ్మబలికే ప్రయత్నం చేశాడని, విచారణలో మైనర్ బాలుడే నిందితుడుగా తేలిందని, కారు కొడుక్కి ఇచ్చిన రాజేంద్రప్రసాద్ పై మైనర్ బాలురుపై కేసులు నమోదు చేశామని ఆయన వెల్లడించారు. దట్టమైన పొగ కారణంగా నియంత్రణ కోల్పోయినట్లు కారులో ఉన్న మైనర్లు విచారణలో తెలిపారని, బ్రేక్ కు బదులుగా యాక్సిలేటర్ నొక్కడంతో ప్రమాదం జరిగిందని, ఐపిసి 304 సెక్షన్ కింద కేసులు పెట్టామని ఆయన తెలిపారు. ప్రమాదానికి ముందు కమాన్ దగ్గర కారులో 100 రూపాయల డీజిల్ నింపుకున్నట్లు ఆయన వెల్లడించారు.