NTV Telugu Site icon

Kaloji Narayana Rao University: విద్యార్థుల సీట్ల సర్దుబాటు పూర్తి.. ఈనెల 12లోగా స్టూడెంట్స్ చేరాలి

Kaloji Medical Students Sea

Kaloji Medical Students Sea

Kaloji Narayana Rao University of Health Sciences Adjusted 300 Students Seats: రాష్ట్రంలోని టీఆర్ఆర్, మహావీర్ మెడికల్ కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్లు రద్దు చేస్తూ.. నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే! అనంతరం ఆ కళాశాల విద్యార్థుల సీట్ల సర్దుబాటుకు కమిషన్ ఈనెల 25వ తేదీన రాష్ట్ర ప్రభుత్వానికి మార్గదర్శకాలు జారీ చేసింది. ఎన్ఎంసీ, రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ఆధారంగా.. కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయం సీట్ల సర్దుబాటు ప్రక్రియను ప్రారంభించింది. ఇప్పుడు ఆ ప్రక్రియ పూర్తైనట్టు ఆ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 300 మంది విద్యార్థులను రాష్ట్రంలోని 13 వైద్య కళాశాలల్లో వారి ఆప్షన్స్ మేరకు.. గత కౌన్సిలింగ్ రిజర్వేషన్లను పాటిస్తూ, సీట్లను సర్దుబాటు చేసింది. కళాశాల వారీగా అభ్యర్థుల జాబితాను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. విద్యార్థులందరూ సంబంధిత ధృవ పత్రాలతో.. ఈనెల 12వ తేదీలోగా ప్రస్తుతం కేటాయించిన కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది.

మహావీర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌, టీఆర్ఆర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌‌లో కన్వీనర్ కోటా, అలాగే యాజమాన్య కోటా కింద 2021-22 విద్యా సంవత్సరానికి ప్రవేశం పొందిన 300 మంది విద్యార్థుల సీట్లను సర్దుబాటు చేయడం జరిగింది. విద్యా సంవత్సరం నష్టపోకుండా.. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలపై విద్యార్థులు, అలాగే వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. అటు.. ధృవ పత్రాలు, ఫీజు తిరిగి విద్యార్థులకు చెల్లించాలని టీఆర్ఆర్, మహావీర్ వైద్య కళాశాలలకు ఇప్పటికే ప్రభుత్వం, యూనివర్సిటీ ఆదేశాలు జారీ చేశాయి. విద్యార్థుల చేరికకు 12న డెడ్‌లైన్ పెట్టారు కాబట్టి.. ఆలోపే ఫీజు, ధృవ పత్రాలను ఆ రెండు కళాశాలలు విద్యార్థులకు తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది.