Site icon NTV Telugu

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్ట్ కార్యాలయాల్లో విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు..

Medigadda Project

Medigadda Project

Kaleshwaram Project: మేడిగడ్డ బ్యారేజీ కుప్పకూలిన ఘటనపై విజిలెన్స్ విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని పలు ఇరిగేషన్ కార్యాలయాల్లో విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. జలసౌధలోని తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యాలయానికి విజిలెన్స్ అధికారులు వెళ్లి తనిఖీలు చేస్తున్నారు. ఈఎన్సీ మురళీధర్ రావు కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు సోదాలు చేస్తున్నారు. కార్యాలయంలోని రెండు, నాలుగో అంతస్తుల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు.హైదరాబాద్ తో పాటు జిల్లా ఇరిగేషన్ కార్యాలయాల్లో 12 ప్రత్యేక విజిలెన్స్ బృందాలతో తనిఖీలు చేపట్టారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టు కార్యాలయాల్లో విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ తనిఖీలు కొనసాగుతున్నాయి. మహదేవ్ పూర్ లోని ఇరిగేషన్ డివిజన్ కార్యాలయంలో అధికారుల బృందం రికార్డులు, విలువైన పత్రాలను పరిశీలిస్తోంది. మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంపుహౌస్‌లకు సంబంధించిన కార్యాలయాల్లో అధికారుల బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి.

Read also: Faith In Astrology: కుటుంబంలో చిచ్చు పెట్టిన జ్యోతిష్యం.. మనస్తాపంతో గృహిణి ఆత్మహత్య..

మేడిగడ్డ బ్యారేజీ కూలిన ఘటనను రేవంత్‌రెడ్డి సర్కార్ సీరియస్‌గా తీసుకుంది. ఈ వైఫల్యం వెనుక కేసీఆర్ ప్రభుత్వంలో బాధ్యులు ఎవరన్న దానిపై దృష్టి సారించింది. ఇటీవల మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన మంత్రుల బృందం అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చింది. ఈ క్రమంలో విజిలెన్స్ విచారణకు ఆదేశించడం ఆసక్తికర పరిణామంగా మారింది. కాళేశ్వరం అవినీతిపై విచారణ జరిపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. ఆ తర్వాత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా ఇదే ప్రకటన చేశారు. ఇటీవల మేడిగడ్డలో మంత్రుల బృందం పర్యటించింది. మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.4600 కోట్లు ఖర్చు చేశామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పరిశీలన అనంతరం ఒక స్తంభం 1.2 మీటర్ల మేర కుంగిపోయినట్లు తేలింది. మేడిగడ్డ ప్రాజెక్టు ఆగిపోవడంపై విచారణలో దోషులుగా తేలిన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో నీటిపారుదల శాఖలో గోప్యత, రహస్య జీవితం, అవినీతి ఆరోపణలు వచ్చాయి. వీటిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. నీటిపారుదల శాఖలో పారదర్శకత ఉండాలని, కాళేశ్వరంపై విచారణ కోట్లాది ప్రజల విశ్వాసానికి సంబంధించిన అంశమని అన్నారు. అంతా పారదర్శకంగా జరుగుతుందని చెప్పారు.
Kanya Kumari: “కన్యాకుమారి” సినిమా టీజర్ రిలీజ్ చేసిన రౌడీ హీరో…

Exit mobile version