K Laxman Predicts Rajagopal Reddy Win In Munugody By Elections: మునుగోడు నియోజకవర్గంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలుపు ఖాయమైందని బీజేపీ ఎంపీ కే. లక్ష్మణ్ జోస్యం చెప్పారు. ఎక్కడ ప్రచారానికి వెళ్లినా.. ప్రజలు బీజేపీకి బ్రహ్మరథం పడుతున్నారన్నారు. కేసీఆర్ కుటుంబం చెప్తోన్న గజకర్ణ, గోకర్ణ విద్యలను ప్రజలు నమ్మడం లేదన్నారు. ప్రజలను, పాలనను గాలికొదిలేసి.. ఢిల్లీలో కేసీఆర్ చక్కర్లు కొడుతున్నారని విమర్శించారు. ఓటమి గ్రహిస్తూనే.. టీఆర్ఎస్ అప్రజాస్వామిక పనులకు తెగపడిందని ఆరోపించారు. మునుగోడులో తమ ఓటమి తథ్యమని తెలిసి.. బీజేపీ మీద దాడులకు దిగుతున్నారని పేర్కొన్నారు. చవకబారు ప్రచారాన్ని ప్రజలు చీదరిస్తున్నారన్నారు.
మునుగోడును ఇన్నాళ్లు దత్తత తీసుకోకుండా ఇన్నేళ్లు ఏం చేశారని కే. లక్ష్మణ్ ప్రశ్నించారు. ఇప్పటివరకు జరిగిన ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చలేదన్నారు. మీ ఎమ్మెల్యే అభ్యర్థి గెలిచినా పని చేయలేని దద్దమ్మనా? అందుకే కేటీఆర్ దత్తత తీసుకుంటానని ప్రకటించారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. మందులు, విందులు, చిందులతో అధికార పార్టీ పగటి వేశగాళ్ళ లాగా ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామాతోనే గట్టుప్పల్ మంలం వచ్చిందని, చర్లగూడెం భూ నిర్వాసితులకు డబ్బులు డిపాజిట్ చేశారని తెలిపారు. బీజేపీ ఉద్యమం, ఒత్తిడి వల్లే గొల్ల-కురుమలకు నగదు బదిలీ జరిగిందన్నారు. రాజగోపాల్ రాజీనామా వల్లే.. చండూరు, చౌటుప్పల్‌లో సీసీ రోడ్లు, అంతర్గత రోడ్లు సాధ్యం అయ్యాయన్నారు.
గిరిజన బంధు, రిజర్వేషన్ పేరుతో సీఎం కేసీఆర్ నాటకాలు ఆడుతున్నారని కే లక్ష్మణ్ విమర్శించారు. కానీ అడవి బిడ్డ, గిరిజన మహిళను రాష్ట్రపతి చేసిన బీజేపీవైపే గిరిజన బిడ్డలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ తమ ఉనికి చాటుకోవడం కోసమే పోటీ చేస్తోందని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్, కాంగ్రెస్‌లది డూఫ్ ఫైట్ అని సెటైర్లు వేశారు. కాంగ్రెస్‌కు పడ్డ ఓటు.. మూసి మురికిల పడ్డట్టేనని కౌంటర్లు వేశారు. దేశమంతా రాహుల్ గాంధీది ‘కాంగ్రెస్ చోడో యాత్ర’ అయితే.. తెలంగాణలో మాత్రం ‘కాంగ్రెస్-టీఆర్ఎస్ జోడో యాత్ర’ అని వ్యాఖ్యానించారు. తోక పార్టీల తోక పట్టుకొని.. టీఆర్ఎస్ కుక్క తోక పట్టుకొని గోదారి ఈదినట్టు ఉందని కామెంట్స్ చేశారు.
కమ్యూనిస్టు కార్యకర్తలు కూడా కమ్యూనిస్ట్ నాయకుల తీసుకున్న నిర్ణయాన్ని జీర్ణించుకోలేక బీజేపీలో చేరుతున్నారని కే లక్ష్మణ్ వెల్లడించారు. తెలంగాణ సెంటిమెంట్ పేరుతో కేసీఆర్ చెప్పే కథలను ప్రజలు నమ్మడం లేదన్నారు. తెలంగాణ పోయి, ఇప్పుడు దక్షిణ భారతం అంటూ నాటకాలు చేస్తున్నారన్నారు. మునుగోడు ఫలితం ద్వారా టీఆర్ఎస్ ప్రభుత్వ పతనానికి నాంది పలకనుందన్నారు. ఉగ్రవాదుల మూలాలకు అడ్డా అయిన తెలంగాణ.. ఇప్పుడు ఆర్ధిక నేరాలకు కూడా అడ్డాగా మారుతోందన్నారు. రసాయన ఎరువులు రైతులకు మరింత చేరువ చేసే పని మోడీ చేస్తున్నారని, యూరియాపై భారీ రాయితీలు ఇచ్చి మోడీ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటోందని కే లక్ష్మణ్ తెలిపారు.
