Bhupalpally: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్ పల్లిలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని హనుమాన్ విగ్రహానికి మంటలు చెలరేగడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. పురాతనమైన శ్రీ అమరేశ్వర స్వామి ఆలయంలో గురువారం సాయంత్రం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అనంతరం ఆలయ ఆవరణంలోని హనుమాన్ విగ్రహానికి మంటలు వ్యాపించాయి. ఈ ఘటన చూసిన స్థానికులు ఒక్కసారిగా భయాందోళన చెందారు. వెంటనే నీళ్లు పోసి మంటలు ఆర్పారు. పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఆలయాన్ని పరిశీలించారు. అమరేశ్వర స్వామి ఆలయంలో చెలరేగిన మంటలపై ఆలయ అర్చకుడు నాగేశ్వర శర్మ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. మంటల్లో కాలిపోయిన హనుమాన్ విగ్రహం పై ప్లాస్టిక్ ఉన్నట్లు గుర్తించానని అన్నారు. విగ్రహం అగ్నికి ఆహుతి కావడంతో స్థానికులు ఆలయానికి, ఊరికి అశుభంగా భావిస్తున్నారని తెలిపాడు. వేద పండితులను సంప్రదించి హనుమాన్ విగ్రహ పునః ప్రతిష్టాపన చేయనున్నట్లు అర్చకులు, స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై కాటారం డిఎస్పీ రామ్మోహన్ రెడ్డి ఆలయానికి చేరుకొని హనుమాన్ విగ్రహాన్ని పరిశీలించారు. ప్రమాదవశాత్తు జరిగిందా లేదా ఎవరైనా గుర్తు తెలియని దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దుండగులను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Harish Rao: పంటలపై రివ్యూ మర్చిపోయారు.. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో హరీష్ రావు..