హుజురాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయిందని కాంగ్రెస్ నేతల్లో అసహనం వ్యక్తమయింది. దీంతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హుజురాబాద్ ఉప ఎన్నికపై పూర్తి బాధ్యత నాదేనని స్పందించారు. ఇదిలా ఉంటే నేడు గాంధీభవన్‌లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఎసీ) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలు హజరయ్యారు.
అయితే ఈ సందర్భంగా కాంగ్రెస్ తెలంగాణ ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్ పార్టీలో క్రమశిక్షణ లోపం ఉందని, పార్టీ నాయకుల కు సూచించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పార్టీ అంశాలపై మాట్లాడాలని అనుకుంటే పొలిటికల్ అఫైర్స్ కమిటీ లో నే మాట్లాడాలని, మీడియా తో మాట్లాడితే ఊరుకునేది లేదని, ఎంత పెద్ద నాయకుడి అయినా పీఎసీలో మాట్లాడాలని, లేదంటే సోనియా, రాహుల్ గాంధీలతో మాట్లాడొచ్చని, గీత దాటితే వేటు తప్పదని హెచ్చరించినట్లు సమాచారం.
మధుయాష్కీ మాట్లాడుతూ.. కల్వకుంట్ల దొంగలు కాంగ్రెస్ బీజేపీ కి మద్దతు ఇచ్చిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ఎప్పుడు బీజేపీ కి మద్దతు ఇవ్వ దని స్పష్టం చేశారు. హుజూరాబాద్ ఫలితం మాకు బాధేనని, కానీ దీంతో మేము కృంగిపోమని తెలిపారు.