రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రాంతంలో పేదల కోసం కేటాయించిన పీడీఎస్ (PDS) బియ్యం అక్రమ దందా గుట్టరయింది. సివిల్ సప్లైస్ ఎన్‌ఫోర్స్‌మెంట్ , టాస్క్‌ఫోర్స్ బృందాలు సంయుక్తంగా నిర్వహించిన ఆకస్మిక తనిఖీలలో భారీ ఎత్తున రేషన్ బియ్యం అక్రమ నిల్వలు బయటపడ్డాయి. ఇబ్రహీంపట్నంలోని న్యూ బన్సల్ రైస్ ఇండస్ట్రీస్‌లో ఈ దాడులు జరగగా, పేదల బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి మిల్లులో నిల్వ ఉంచినట్లు అధికారులు గుర్తించారు.
మిల్లులో బయటపడిన వేల కిలోల రేషన్ బియ్యం.. లారీ సీజ్
అధికారులు జరిపిన సోదాల్లో రైస్ మిల్లు ప్రాంగణంలో సుమారు 50 కిలోల బరువున్న 677 బస్తాలు, అలాగే 25 కిలోల బరువున్న 101 పీడీఎస్ బియ్యం బస్తాలు ఉన్నట్లు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా అక్రమ రవాణాకు సిద్ధంగా ఉన్న ఓ టాటా లారీని (TS-03-UB-3399) కూడా అధికారులు సీజ్ చేశారు. ఆ లారీలో అదనంగా మరో 51 బస్తాల బియ్యం లభించాయి. తనిఖీలు నిర్వహించిన టెక్నికల్ అధికారులు ల్యాబ్ పరీక్షల ద్వారా పట్టుబడిన సరుకు పీడీఎస్ ఫోర్టిఫైడ్ రైస్ (FRK) అని స్పష్టంగా నిర్ధారించారు.
నిందితులపై చట్టపరమైన చర్యలు.. ముమ్మరమైన దర్యాప్తు
ఈ అక్రమ బియ్యాన్ని సిద్దిపేట జిల్లా మోతే గ్రామంలోని భారతి ఇండస్ట్రీస్ నుంచి కొనుగోలు చేసినట్లు మిల్లు యజమాని గీతేష్ బన్సల్ అధికారుల ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం తెలంగాణ పీడీఎస్ రైస్ కంట్రోల్ ఆర్డర్-2016లోని క్లాజ్ 17(e) కింద నేరమగడంతో అధికారులు కేసు నమోదు చేశారు. ఈ దందాలో భాగమైన న్యూ బన్సల్ రైస్ ఇండస్ట్రీస్ యజమాని గీతేష్ బన్సల్, శ్రీరామ్ లోహియా , భారతి ఇండస్ట్రీస్ ఓనర్ నాగభూషణంపై ఫిర్యాదు చేసి దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు.

