Site icon NTV Telugu

Telangana Panchayat Elections: పంచాయతీ ఎన్నికల సందడి.. తొలి రోజు భారీగా నామినేషన్లు..

Telangana Panchayat Electio

Telangana Panchayat Electio

Telangana Panchayat Elections: తెలంగాణలో పల్లెపోరు మొదలైంది. మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైంది. నామినేషన్ల స్వీకరణ కూడా మొదలైంది. మొదటి విడతలో 4 వేల 236 గ్రామాల పంచాయతీలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇక, ఆయా గ్రామ పంచాయితీల్లో ఎన్నికల సందడి మొదలైంది.. మొదటి రోజు 4,236 సర్పంచ్ స్థానాలకు 3,242 సర్పంచ్ నామినేషన్లు దాఖలు కాగా.. వార్డు మెంబర్ల కోసం తక్కువస్థాయిలో అంంటే.. 37,440 వార్డు మెంబర్ స్థానాలకు 1,821 నామినేషన్లు మాత్రమే దాఖలు చేశారు.. ఇందులో అత్యధికంగా నల్గొండ జిల్లాలో 318 సర్పంచ్ స్థానాలకు 421 నామినేషన్లు దాఖలు కాగా.. అత్యల్పంగా కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో 114 సర్పంచ్ స్థానాలకు 15 నామినేషన్లు దాఖలు అయినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ పేర్కొంది..

Read Also: India – Nepal: భారత్ – నేపాల్ మధ్య రూ.100 నోటు పంచాయితీ..

కాగా, తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌తో లోకల్ ఫైట్ స్టార్ట్ అయ్యింది. గురువారం ఉదయం 10:30 గంటలకు నోటిఫికేషన్‌ విడుదల కావడంతో నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అయింది. నామినేషన్ల స్వీకరణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా పలు జిల్లాల్లో కొన్ని గ్రామ పంచాయితీలకు మొదటి రోజు నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఫస్ట్ ఫేజ్ ఎన్నికలను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. మొత్తంగా గ్రామపంచాయతీ ఎన్నికలను మూడు దఫాల్లో నిర్వహిస్తామని SEC ఇదివరకే ప్రకటించింది. రాష్ట్రంలో 31 జిల్లాల పరిధిలో 564 మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు కమిషనర్ రాణికుమిదిని స్పష్టం చేశారు. 12,728 గ్రామ పంచాయతీలకు, 1,12,242 వార్డులకు ఎన్నికలు డిసెంబర్ 11, 14, 17 వ తేదీల్లో నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేసింది స్టేట్‌ ఎలక్షన్‌ కమిషన్‌.

మొదటి విడతలో 189 మండలాల్లో 4,236 గ్రామపంచాయతీలకు, 37,440 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. మొదటి విడత నోటిఫికేషన్ విడుదల కావడంతోనే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అయ్యింది. పలు గ్రామాల సర్పంచ్, వార్డు మెంబర్‌ల కోసం అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు నామినేషన్ ఫీజును 1000 రూపాయలుగా, బీసీ, జనరల్ అభ్యర్థుల నామినేషన్ ఫీజును రెండు వేలుగా నిర్ణయించారు. ఈ నామినేషన్లను 29వ తేదీ 5 గంటల వరకు దాఖలు చేయవచ్చు. నామినేషన్ల స్క్రూటిని నవంబర్ 30న జరగనుంది. నామినేషన్లపై అభ్యంతరాలను డిసెంబర్ 1 తేదీ వరకు తెలుపవచ్చు. నామినేషన్ల ఉపసంహరణను డిసెంబర్ 3న చేసుకోవచ్చు. ఇక, డిసెంబర్‌ 3న సాయంత్రం పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటించనుంది రాష్ట్ర ఎన్నికల సంఘం. డిసెంబర్ 11న పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు పోలింగ్ ఉంటుందని కమిషనర్ రాణికుమిదిని ప్రకటించారు. పోలింగ్ ముగిసిన తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ఉంటుంది. కౌంటింగ్ అనంతరం ఫలితాల ప్రకటన చేస్తారు అక్కడి రిటర్నింగ్ ఆఫీసర్. ఫలితాల తర్వాత ఉప సర్పంచ్‌ని గ్రామ వార్డు సభ్యులు ఎన్నుకోవాల్సి ఉంటుంది. మొదటి విడత ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మొదలు కావడంతో… పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎక్కడ కూడా డబ్బు, మద్యం, ఓటర్లను ప్రభావితం చేసే ఆర్టికల్స్‌ను తీసుకెళ్లకుండా అరికడుతున్నారు పోలీసులు.

Exit mobile version