Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు

Nhrc 22a

Nhrc 22a

Telangana 22A Land List: తెలంగాణలో సంచలనంగా మారింది 22A.. రాష్ట్రంలో 22A నిషేధిత జాబితాలో ప్రైవేట్ వ్యక్తుల భూములను చేర్చిన అంశంపై జాతీయ మానవ హక్కుల సంఘం (NHRC) కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేట్ భూములను 22A జాబితాలో చేర్చడంపై స్వతంత్ర విచారణ చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. తీసుకున్న చర్యలపై నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలని సూచించింది. 22A నిషేధిత జాబితా కారణంగా సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది, సామాజికవేత్త కారుపోతుల రేవంత్ NHRCకి ఫిర్యాదు చేశారు. సెప్టెంబర్ 14న ఆయన ఈ ఫిర్యాదును దాఖలు చేశారు. ప్రైవేట్ వ్యక్తుల భూములు నిషేధిత జాబితాలో చేరడంతో ఆస్తుల రిజిస్ట్రేషన్, లావాదేవీల విషయంలో ప్రజలు మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు..

ఈ ఫిర్యాదుపై NHRC సోమవారం విచారణ చేపట్టింది. 22A జాబితా కారణంగా ప్రజల ఆస్తి హక్కులకు భంగం కలుగుతున్న అంశాన్ని సంఘం పరిశీలించింది. జీవించే హక్కు, సమానత్వ హక్కు, వృత్తి లేదా వ్యాపారం నిర్వహించే హక్కు, ఆస్తి హక్కులకు సంబంధించిన రాజ్యాంగ నిబంధనలను NHRC ప్రస్తావించింది. ప్రత్యేకంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, ఆర్టికల్ 14, ఆర్టికల్ 19(1)(g), ఆర్టికల్ 300-A కింద ఉన్న హక్కులకు సంబంధించిన అంశాలను NHRC పరిశీలించింది. ప్రైవేట్ వ్యక్తుల భూములు 22A నిషేధిత జాబితాలోకి ఎలా చేరాయి, అందుకు సంబంధించిన నిర్ణయ ప్రక్రియలో ఏమైనా లోపాలు ఉన్నాయా అనే అంశంపై స్వతంత్రంగా విచారణ జరపాలని ఆదేశించింది.

తెలంగాణలో 22A నిషేధిత జాబితాలో ప్రైవేట్ భూములు, కొన్ని నివాస ప్రాంతాలు చేరడంపై ఇటీవలి కాలంలో ఫిర్యాదులు, వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా 22A సంబంధిత సమస్యలను పరిష్కరించేందుకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. సెక్షన్ 22A కింద నిషేధిత జాబితాలో ఉన్న భూములకు సంబంధించిన పెండింగ్ కేసులను పరిశీలించి పరిష్కరించేందుకు కమిటీకి బాధ్యతలు అప్పగించారు. తాజా NHRC ఆదేశాల ప్రకారం, 22A నిర్ణయంపై తక్షణమే స్వతంత్ర విచారణ చేపట్టి, బాధిత ప్రజలకు అవసరమైన ఉపశమనం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలి. చేపట్టిన చర్యలు, విచారణ పురోగతిపై నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలని తెలంగాణ సీఎస్‌ను NHRC ఆదేశించింది.