New Year Celebrations 2026: తెలుగురాష్ట్రాల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంతా రెడీ అయింది.2025కి గ్రాండ్‌గా బై బై చెబుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు జనం సిద్ధమయ్యారు. వేడుకల కోసం హోటళ్లు, రిసార్ట్లు, పబ్‌లు, క్లబ్బుల నిర్వహకులు, యాజమాన్యాలు ఏర్పాట్లు చేశాయి. నూతన ఏడాదిలో కొత్త ఆశలు, ఆశయాలతో ప్రయాణం ప్రారంభించే యువత క్షణికావేశంలో తప్పులు చేసి ముప్పు తెచ్చుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Read Also: PAN–Aadhaar Linking Deadline: పాన్ – ఆధార్ లింక్ గడువును మరోసారి పొడిగిస్తారా..?
హైదరాబాద్‌లో నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా 31 రాత్రి నుంచి జనవరి 1 అర్ధరాత్రి దాటే వరకు హుస్సేన్‌సాగర్ చుట్టూ వాహనాల రాకపోకలపై ఆంక్షలు అమలులో ఉంటాయి. ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డు, అప్పర్ ట్యాంక్‌బండ్‌పై వాహనాల రాకపోకలు నిలిపివేస్తారు. శాంతిభద్రతల నిర్వహణ, రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పోలీసు ఆంక్షలు అమల్లో ఉంటాయి.ఇప్పటికే పబ్‌లు, హోటళ్లు, బార్ల నిర్వాహకులకు నిబంధనల అమలుపై కచ్చితమైన ఆదేశాలు ఇచ్చారు. వేడుకల్లో మైనర్లకు మద్యం సరఫరా చేస్తే చర్యలు తప్పవంటున్నారు. నిర్వాహకులు నిబంధనలు పాటించాలని, స్థానికులకు ఇబ్బంది కలగకుండా డీజే సౌండ్, వాహనాల నియంత్రణ చేయాలన్నారు. హాజరైన వారిలో మద్యం తాగిన వాళ్లను సురక్షితంగా ఇల్లు చేర్చేందుకు పబ్‌ల నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. అర్ధరాత్రి దాటాక సంబరాలు, శుభాకాంక్షలు చెప్పే ఉద్దేశంతో ఇష్టానుసారం యువత రోడ్లపైకి రావద్దన్నారు పోలీసులు. నిబంధనలు ఉల్లంఘిస్తే.. ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని తేల్చిచెప్పారు.
న్యూ ఇయర్ ఈవెంట్ నిర్వాహకులకు పోలీసులు కీలక హెచ్చరికలు జారీ చేశారు. న్యూ ఇయర్ ఈవెంట్స్‌లో సీసీ కెమెరాలు తప్పనిసరి చేశారు. కొత్త ఏడాది వేడుకల్లో అశ్లీల నృత్యాలపై కూడా నిషేధం విధించారు. ఔట్‌డోర్‌లో రాత్రి 10 గంటల తర్వాత లౌడ్ స్పీకర్లు కూడా బ్యాన్ చేశారు పోలీసులు. పార్టీల్లో డ్రగ్స్ వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీసులు హెచ్చరించారు. న్యూ ఇయర్ వేడుకల సమయంలో తాగి వాహనం నడిపితే 10 వేలు జరిమానాతో పాటు 6 నెలలు జైలు విధిస్తారు. మైనర్లు వాహనం నడిపితే యజమానిపైనా కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. ర్యాష్ డ్రైవింగ్‌పై వెహికల్ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. నగరంలో రాత్రి ఒంటి గంట వరకు న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించే వాళ్లు అనుమతి తీసుకోవాల్సిందిగా సూచించారు. డీజే శబ్దం 45 డెసిబెల్స్‌కు మించకూడదని, పబ్బులు, బార్లలో కపుల్స్ ఈవెంట్లు, మైనర్లకు అనుమతి లేదని స్పష్టంచేశారు సిటీ పోలీసులు.
అటు అటు ఏపీలో న్యూ వేడుకలకు నగరాలు సిద్ధమయ్యాయి.హోటళ్లు, క్లబ్బులు, బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు పోలీసులు. డ్రోన్ కెమెరాల చిత్రీకరణతో పాటు ఎక్కువ మంది సిబ్బందితో, అన్నిచోట్లా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. ఆడవారి పట్ల అసభ్యంగా ప్రవర్తించే ఆకతాయిల ఆట కట్టిస్తామన్నారు. శ్రుతి మించితే వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు.ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా ప్రశాంతంగా వేడుకలను జరుపుకోవాలని సూచించారు పోలీసులు. నిబంధనలు పాటిస్తూ ప్రజలు సహకరించాలని కోరారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా, రాత్రి వేళల్లో విజయవాడ బెంజ్ సర్కిల్, కనకదుర్గ ఫ్లైఓవర్లను పూర్తిగా మూసివేయనున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా.. శాంతిభద్రతలను కాపాడేందుకు ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా యువత ఎక్కువగా గుంపులుగా చేరి కేకులు కట్ చేయడం, వాహనాలతో హడావుడి చేయడం వంటివి చేస్తుంటారు. అలాంటి వాటిని అరికట్టడానికి ఆంక్షలు విధించారు. ప్రశాంతంగా న్యూ వేడుకలు జరుపుకోవాలని,రూల్స్ బ్రేక్ చేస్తే చర్యలు తప్పవని తెలుగు రాష్ట్రాల పోలీసులు హెచ్చరించారు.
