Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కళాశాల పూర్వ విద్యార్థులు, అధ్యాపకుల ఆత్మీయ సమ్మేళనం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్టోబర్ 4వ తేదీ ఆదివారం ఉదయం 10.30 గంటలకు ఫిల్మ్‌నగర్‌లోని ఫిల్మ్‌నగర్ కల్చరల్ క్లబ్‌లో ఈ “Silver Jubilee Fraternity Meet” జరగనుంది. ఈ కార్యక్రమానికి భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. కళాశాలతో అనుబంధం ఉన్న పూర్వ విద్యార్థులు, అధ్యాపకులు పెద్ద సంఖ్యలో ఈ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇక, 1972 సంవత్సరం నుంచి ఇవాళ్టి వరకు కర్నూలు సిల్వర్ జూబ్లీ కళాశాలలో విద్యనభ్యసించిన వివిధ బ్యాచ్‌లకు చెందిన పూర్వ విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. విద్యాభ్యాసం అనంతరం దేశవ్యాప్తంగా వివిధ కీలక రంగాల్లో సేవలందించిన సహచర మిత్రులు ఈ వేడుకలో కలుసుకోనున్నారు. ఈ పూర్వ విద్యార్థుల్లో IAS, IPS, IRS అధికారులు, ఆర్మీకి చెందిన అధికారులు తదితర వివిధ రంగాల్లో పనిచేసిన వారు ఉన్నారు. ప్రస్తుతం వివిధ పదవుల్లో కొనసాగుతున్న వారితో పాటు ఉద్యోగ విరమణ చేసిన పలువురు పూర్వ విద్యార్థులు కూడా ఈ సమ్మేళనానికి హాజరయ్యే అవకాశం ఉంది. ఎన్నో ఏళ్ల తర్వాత పాత మిత్రులు, అధ్యాపకులు ఒకే వేదికపై కలుసుకుని తమ కళాశాల రోజుల జ్ఞాపకాలను పంచుకునేలా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. వివిధ బ్యాచ్‌లకు చెందిన పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యేలా నిర్వాహకులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

