US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం

  • అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి
  • 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
  • మృతదేహాన్ని భారత్‌కు తీసుకురావాలని విజ్ఞప్తి
Us

Us

అమెరికాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ జాబెర్ హుస్సేన్ (28) అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఈ మేరకు రూమ్‌మేట్ ఫోన్ చేసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆగస్టు 28నే జాబెర్ హుస్సేన్‌కు పెళ్లైంది. ఇంతలోనే మరణవార్త వినడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

మహ్మద్ జాబెర్ హుస్సేన్ అమెరికాలోని మసాచుసెట్స్‌లోని లోవెల్‌లో తన ఇంట్లో చనిపోయినట్లుగా సెప్టెంబర్ 14న కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. హుస్సేన్ సివిల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అయితే నిద్రలోనే చనిపోయినట్లుగా రూమ్‌మేట్ సమాచారం ఇచ్చాడు. అయితే ఇంత సడన్‌గా చనిపోవడంపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జాబెర్ హుస్సేన్ మృతిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఆయన మరణానికి గల కారణాన్ని నిర్ధారించేందుకు కుటుంబ సభ్యులు పోస్టుమార్టం, వైద్య నివేదికల కోసం ఎదురుచూస్తున్నారు.

జాబెర్ హుస్సేన్‌కు ఆగస్టు 28న టెక్సాస్‌లో వివాహం జరిగింది. వివాహం తర్వాత మసాచు‌సెట్స్‌లో నివాసం ఉంటున్నాడు. అక్కడనే నివాసిస్తూ ఉద్యోగం చేస్తున్నాడు. అయితే భార్య అతనితో ఉంటుందా? లేదా అనేది ఇంకా తెలియలేదు. అయితే సెప్టెంబర్ 14న జాబెర్ తన కుటుంబ సభ్యులతో చివరిసారిగా మాట్లాడినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత దాదాపు ఎనిమిది గంటలకు ఆయనతో కలిసి ఉంటున్న రూమ్‌మేట్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి జాబెర్ నిద్రలోనే మృతి చెందినట్లు సమాచారం ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ఘటన జరిగిన వెంటనే ఆయనకు వైద్య సహాయం అందిందా? మరణానికి అసలు కారణం ఏమిటి? అనేది తెలియలేదు.

మృతదేహాం కోసం కుటుంబం విజ్ఞప్తి

జాబెర్ హుస్సేన్ కుటుంబం ఆర్థికంగా బలహీన వర్గానికి చెందినదని, అమెరికా నుంచి మృతదేహాన్ని హైదరాబాద్‌కు తరలించేందుకు అవసరమైన ఖర్చులు, అధికారిక ప్రక్రియలను పూర్తి చేయడం తమకు కష్టంగా ఉంటుందని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతదేహాన్ని భారత్‌కు తీసుకురావడానికి సహాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కుటుంబం కోరింది. మజ్లిస్ బచావో తెహ్రీక్ (MBT) అధికార ప్రతినిధి అంజద్ ఉల్లా ఖాన్.. జాబెర్ తండ్రి కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌కు రాసిన లేఖను సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అమెరికాలోని సంబంధిత భారత రాయబార కార్యాలయం స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుని, అవసరమైన అధికారిక ప్రక్రియలను పూర్తి చేయడంలో కుటుంబానికి సహాయం చేయాలని కోరారు. జాబెర్ కుటుంబం తీవ్ర విషాదంలో ఉందని అంజద్ ఉల్లా ఖాన్ పేర్కొన్నారు. ఈ సమయంలో భారత ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి.. ఎలాంటి ఆలస్యం లేకుండా జాబెర్ మృతదేహాన్ని కుటుంబ సభ్యుల దగ్గరకు తీసుకురావడానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులు పోస్టుమార్టం, వైద్య నివేదికల కోసం ఎదురుచూస్తున్నారు. అవి అందిన తర్వాతే జాబెర్ మృతికి సంబంధించిన పరిస్థితులపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

2021లో అమెరికాకు..

జాబెర్ హుస్సేన్ 2021లో ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లారు. కనెక్టికట్‌లోని యూనివర్సిటీ ఆఫ్ న్యూ హెవెన్‌లో సివిల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. 2023లో చదువు పూర్తి చేసిన అనంతరం ‘Estimator’ అనే సంస్థలో ఇంటర్న్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించినట్లు ఆయన LinkedIn ప్రొఫైల్‌లో పేర్కొన్నారు. తర్వాత Green International Affiliates Inc.లో మూడేళ్లకు పైగా పనిచేశారు. ఈ ఏడాది జూన్‌లో మరోసారి ఉద్యోగం మారి మసాచుసెట్స్‌లోని Lochner సంస్థలో పనిచేస్తున్నట్లు సమాచారం. పెళ్లైన కొద్ది రోజులకే అమెరికాలో జాబెర్ హుస్సేన్ మృతి చెందడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.