Site icon NTV Telugu

HYD: దాంపత్యాలు విచ్ఛిన్నం అవుతున్నాయి – నెలకు 250 విడాకుల కేసులు

250 Divorce Cases Per Month

250 Divorce Cases Per Month

పెళ్లి అనేది ఇద్దరి మధ్య కేవలం ఒక ఒప్పందం కాదు.. జీవితాంతం ఒకరికి ఒకరు అండగా నిలవాలని ఇచ్చుకునే మాట. ప్రేమ, నమ్మకం, ఓపిక, అర్థం చేసుకోవడం అనే నాలుగు స్తంభాలపై నిలబడే ఈ బంధం, కాలం మారినా విలువ మాత్రం ఎప్పటికీ తగ్గదు. ఆనందాల్లో భాగస్వాములవడం ఎంత ముఖ్యమో, కష్టాల్లో చేతులు పట్టుకొని నిలవడం అంత కన్నా ముఖ్యమైనది. అందుకే మన పెద్దలు “పెళ్లి అనేది రెండు మనసులు, రెండు కుటుంబాలు కలిసే పవిత్రమైన అనుబంధం” అంటుంటారు. అయితే, నేటి వేగమైన జీవనశైలిలో ఈ బంధం ముందెన్నడూ లేనంత పరీక్షలను ఎదుర్కొంటూ ఉంది. నగర జీవనం, ఒత్తిడి, అంచనాలు, సంఘర్షణలు ఇవన్నీ కలిసి ఈ పవిత్ర బంధానికి సవాళ్లు విసురుతున్నాయి.

Also Read : Manchu Lakshmi : బొడ్డు కనిపిస్తే తప్పేంటి? టాలీవుడ్ కల్చర్‌పై మంచు లక్ష్మి హాట్ కామోంట్స్..

ముఖ్యంగా హైదరాబాద్‌లో దాంపత్య జీవితం క్రమంగా బలహీనపడుతున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. ప్రేమ పెళ్లి, అనుకోని పెళ్లి ఏ రూపంలో జరిగినా, చాలామంది జంటలు చిన్న చిన్న విషయాలకే కోర్టు మెట్లెక్కుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఇగో క్లాష్‌లు, ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవడం, ఆత్మవిశ్వాసం లోపించడం, వివాహేతర సంబంధాలు, సోషల్ మీడియా ప్రభావం, త్వరగా నిర్ణయాలు తీసుకోవడం ఇలా చెప్పుకుంటూ పోతే కారణాల జాబితా పెద్దదే.

అయితే ఇక్కడ ప్రత్యేకంగా 25–35 ఏళ్ల మధ్య వయసున్న జంటలే ఎక్కువగా సమస్యలు ఎదుర్కొంటున్నారని న్యాయవాదులు చెబుతున్నారు. ఈ వయసులోనే కెరీర్ ఒత్తిడి, అంచనాలు, వ్యక్తిగత స్పేస్ కోసం పోరాటం ఎక్కువగా ఉండటం వల్ల చిన్న గొడవలు పెద్దగా మారుతున్నట్లు కనిపిస్తుంది. ఫ్యామిలీ కోర్టుల రికార్డుల ప్రకారం, ప్రతి నెలా సుమారు 250 విడాకుల కేసులు నమోదవుతున్నాయి. ఇది నగరంలోని మారుతున్న జీవన శైలికి అద్దం పడుతోంది.

పెద్దల మాట ప్రకారం “బంధాన్ని బలపరచుకోవాలి గాని, బలహీనపరచుకోవడానికి కాదు”అని చెబుతున్నప్పటికీ, చాలా జంటలు మాట్లాడుకోవడం, కౌన్సిలింగ్ తీసుకోవడం వంటి అవకాశాలను వదిలేసి వెంటనే విడాకుల వైపు అడుగులు వేస్తున్నారని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాంపత్యంలో సమస్యలు వచ్చినప్పుడు ఒకరికొకరు వినండి, అర్థం చేసుకోవడం, సమయం ఇవ్వడం చాలా అవసరమని వారు సలహా ఇస్తున్నారు.

Exit mobile version