Site icon NTV Telugu

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో బిగ్‌ ట్విస్ట్..! సీఎం కుటుంబ సభ్యులకు సిట్‌ నోటీసులు

Phone Tapping Case

Phone Tapping Case

Phone Tapping Case: తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌ వచ్చి చేరింది.. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్‌ను ట్యాప్ చేసిన వ్యవహారాన్ని దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT), ఇప్పుడు కేసులో కీలక మలుపు తీసుకుంది. ప్రతిపక్ష నేతగా రేవంత్ రెడ్డి ఉన్న సమయంలో ఆయనతో పాటు, ఆయన సోదరుడు కొండల్ రెడ్డి ఫోన్ కూడా ట్యాపింగ్‌కు గురైనట్లు SIT దర్యాప్తులో గుర్తించింది. ఈ క్రమంలోనే, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు కూడా కేసుకు సంబంధించి నోటీసులు జారీ చేసింది సిట్.. సీఎం రేవంత్‌ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డిని విచారణకు పిలిచారు సిట్‌ అధికారులు… రేపు ఉదయం SIT ఎదుట హాజరు కావాలని ఆదేశిస్తూ కొండల్ రెడ్డికి నోటీసులు అందజేశారు. ట్యాపింగ్ జరిగిన సమయంలో ఫోన్ సంభాషణలు, వ్యక్తిగత సమాచారం, ఇతర కీలక అంశాలపై వివరాలు సేకరించేందుకు SIT ఈ విచారణను నిర్వహించనుంది.

Read Also: Bollywood : బాలీవుడ్ కల్ట్ సాంగ్స్‌ను రీమిక్స్ చేస్తున్న స్టార్స్

అయితే, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు SIT నోటీసులు ఇవ్వడం ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా అధికారంలో ఉన్న నేతల కుటుంబాన్ని విచారణకు పిలవడం అరుదైన పరిణామం కావడంతో, ఈ కేసు దర్యాప్తు తటస్థంగా, వేగంగా, కీలకంగా సాగుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే రేవంత్ రెడ్డి, అప్పటి ప్రభుత్వం తన ఫోన్‌ను ట్యాప్ చేసిందంటూ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన సీఎం అయిన తర్వాత అదే వ్యవహారంలో ఆయన కుటుంబాన్నే SIT విచారణకు పిలవడం, కేసు దర్యాప్తు ఎటువైపు వెళ్తుందన్న ఆసక్తిని మరింత పెంచింది. కాగా, తెలంగాణలో గత ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అనుమతులు లేకుండా వేలాది ఫోన్లను ట్యాప్ చేశారన్న ఆరోపణలతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. రాజకీయ నాయకులు, మీడియా ప్రతినిధులు, వ్యాపార వర్గాలకు చెందిన ఫోన్లు కూడా ట్యాప్ అయినట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. ఈ కేసులో ఇప్పటికే పలువురు మాజీ అధికారులు, రాజకీయ నేతలను SIT విచారిస్తోంది.

అయితే, సీఎం రేవంత్‌ రెడ్డి కుటుంబాన్ని విచారణకు పిలవడం ద్వారా, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బాధితుల వాంగ్మూలాలు, సాక్ష్యాల నిర్ధారణ, ట్యాపింగ్ ఆదేశాలు ఎక్కడి నుంచి వచ్చాయి, దాని వెనక ఉన్న కుట్ర కోణం వంటి అంశాలపై SIT మరింత లోతుగా దర్యాప్తు చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఫోన్ ట్యాపింగ్ కేసు చర్చగా మారింది.. రేవంత్ రెడ్డి కుటుంబం SIT విచారణకు హాజరైన తర్వాత మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

Exit mobile version