AP, Telangana Holiday Today: ఏపీ, తెలంగాణలో నేడు సెలవు.. ఈ జిల్లాల్లో అన్నీ బంద్..

Ap, Telangana Holiday Today

Ap, Telangana Holiday Today

AP, Telangana Holiday Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో శుక్రవారం పలు ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఏపీలో భారీ వర్షాలు, తీవ్ర వాయుగుండం ప్రభావం కారణంగా పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ఇచ్చారు. తెలంగాణలో గణేశ్‌ నిమజ్జనం నేపథ్యంలో హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు సెప్టెంబర్‌ 25న సెలవు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కోనసీమ, అల్లూరి సీతారామరాజు, పోలవరం, ఎన్టీఆర్‌, కృష్ణా తదితర జిల్లాల్లో వర్షాల పరిస్థితులను బట్టి విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు ఆయా జిల్లాల కలెక్టర్లు..

తీవ్ర వాయుగుండం ప్రభావం
దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర ప్రాంతాలపై కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్ర, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్రకు ఈ రోజు భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలుల హెచ్చరికలు జారీ అయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పొంగిపొర్లుతున్న వాగులు, కాజ్‌వేలు దాటేందుకు ప్రయత్నించవద్దని, తెగిపడిన విద్యుత్‌ తీగలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్థానిక అధికారులను సంప్రదించాలని సూచించారు. వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రభావిత జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్‌, ఎస్డీఆర్ఎఫ్‌ బృందాలను సిద్ధంగా ఉంచారు. శ్రీకాకుళం, మన్యం, పోలవరం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో మొత్తం 8 ఎస్డీఆర్ఎఫ్‌, 5 ఎన్డీఆర్ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలకు అందుబాటులో ఉన్నాయి.

బుడమేరు ఉధృతితో గుడివాడలో ఆందోళన
కృష్ణా జిల్లా గుడివాడ పరిధిలో బుడమేరు వరద ఉధృతి పెరుగుతోంది. నందివాడ మండలంలో ప్రమాదకర స్థాయిలో ప్రవాహం కొనసాగుతోంది. బుడమేరు పరివాహక ప్రాంతంలోని పంట పొలాలు నీట మునిగాయి. పుట్టగుంట బుడమేరు వంతెనపై సుమారు అడుగు ఎత్తున వరదనీరు ప్రవహిస్తోంది. ఎగువ నుంచి భారీగా కొట్టుకొస్తున్న గుర్రపుడెక్క కారణంగా ప్రవాహానికి అంతరాయం ఏర్పడటంతో అధికారులు ప్రొక్లైనర్లతో తొలగిస్తున్నారు. వరద ఉధృతి తగ్గకపోతే గుడివాడ–హనుమాన్‌ జంక్షన్‌ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉండటంతో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.