Site icon NTV Telugu

Andhra Girl Jailed in Hyderabad: ప్రేమించినోడి కోసం హైదరాబాద్‌కు యువతి.. పోలీసుల ఎంట్రీతో కటకటాల్లోకి..!

Andhra Girl Jailed In Hyder

Andhra Girl Jailed In Hyder

Andhra Girl Jailed in Hyderabad: హైదరాబాద్ పోలీసులు మోపిన కేసులతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ యువతి వాపోతోంది.. కానీ, పట్టించుకునే దిక్కు లేక జైలు జీవితం గడుపుతోంది. FIRలు నమోదైన సమయంలో తాను రొయ్యల ఫ్యాక్టరీలో పనిచేస్తున్నట్టు బంధువులు ఆధారాలు సేకరించడంతో, ఆమెను విడిపించేందుకు కుటుంబసభ్యులు ప్రయత్నాలు ప్రారంభించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం వెలివర్రుకు చెందిన 19 ఏళ్ల రాజీ అనే యువతి గత మూడు వారాలుగా చంచల్‌గూడ జైలులో ఉంది. తల్లి మరణం తర్వాత ఉండిలోని వెల్కమ్ రొయ్యల ఫ్యాక్టరీలో కూలీగా పనిచేస్తున్న ఆమె.. గతంలో ఎప్పుడూ హైదరాబాద్ వెళ్లలేదు.

Read Also: Tata Sierra: నెల రోజులు కాకముందే.. 29.9 కిమీ మైలేజ్ సాధించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం..

అయితే, గత నెల 6వ తేదీన ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు రొయ్యల ఫ్యాక్టరీలో పని చేసిన రాజీ, అదే రోజు అర్ధరాత్రి తన ప్రేమించిన యువకుడు లోకేష్‌తో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత వారిని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంధువుల ఆరోపణల ప్రకారం.. రాజీపై చిల్లర దొంగతనాల కేసులతో మొత్తం 12 FIRలు నమోదు చేశారు. ఆ FIRలు నమోదైన సమయానికి ఆమె ఉండిలో ఫ్యాక్టరీలో పనిచేస్తున్నట్లు కుటుంబసభ్యులు ఆధారాలు చూపుతున్నారు.

ఇటీవల ములాఖాత్‌లో రాజీని కలవడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.. చోరీలు చేశానని ఒప్పుకో, శిక్ష తగ్గిపోతుంది; బయటికి వెళ్తావు.. అని పోలీసులు బలవంతం చేస్తున్నారని తండ్రి, బంధువులకు వాపోయింది. మరోవైపు, పోలీసుల దర్యాప్తులో, రాజీతో కలిసి వెళ్లిన భీమవరం యువకుడు లోకేష్ మరియు అతని స్నేహితులు చోరీలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. అందుకే రాజీ కూడా వారి వెంట ఉన్నందున కేసుల్లోకి లాగేశారని బంధువుల ఆరోపణ. 6వ తేదీన మా అమ్మాయి ఇక్కడే ఉంది. అదే రోజు హైదరాబాద్‌లో ఆమెపై కేసులు ఎలా పెడతారు?అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాజీ బంధువులు.

తమ కుమార్తె కనిపించడం లేదని ఉండి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. కొద్ది రోజుల తర్వాత మీ అమ్మాయి దొంగతనాలు చేసి అరెస్టయ్యింది.. అనే ఫోన్ రావడంతో కుటుంబసభ్యులు షాక్‌కు గురయ్యారు. గతంలో ఎప్పుడూ హైదరాబాద్‌కు వెళ్లని 19 ఏళ్ల యువతిపై వరుసగా 12 కేసులు నమోదు కావడం వివాదాస్పదంగా మారింది. ఇప్పుడు ఈ కేసుల్లో హైదరాబాద్ పోలీసులు ఏ ఆధారాలు చూపుతారు? రాజీ నిజంగా అక్కడ చోరీలకు పాల్పడిందా? లేక కేసులు తప్పుగా మోపబడాయా? అన్న ప్రశ్నలపై అందరి దృష్టి ఉంది.

Exit mobile version