Site icon NTV Telugu

HYD Traffic Police : కొత్త టాస్క్‌ఫోర్స్ రోడ్డెక్కింది.. బండి భలేగుంది..!

Hyd Traffic Police

Hyd Traffic Police

HYD Traffic Police : హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలను మరింత సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు నగర పోలీసులు కొత్త అడుగు వేశారు. సాధారణంగా ప్రధాన జంక్షన్ల వద్ద కనిష్టం ఇద్దరు, గరిష్టం ముగ్గురు పోలీసులు విధుల్లో ఉంటారు. కానీ రెండు జంక్షన్ల మధ్యలో సమస్యలు తలెత్తినప్పుడు స్పందన ఆలస్యమవుతుండేది. ఈ లోటు తీర్చేందుకు ప్రత్యేకంగా ట్రాఫిక్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ (HCSC) సహకారంతో తొలి దశలో 50 అత్యాధునిక అవెంజర్ వాహనాలను కొనుగోలు చేసి వాటిని టాస్క్‌ఫోర్స్‌కు అందజేశారు. వీటిని గురువారం నగర కొత్వాల్ సీవీ ఆనంద్ ఆవిష్కరించారు.

Hero Dharma : బిగ్ బాస్ ఆర్టిస్టులతో హీరో అక్రమ సంబంధాలు.. భార్య ఆరోపణలు

బజాజ్ కంపెనీకి చెందిన తెలుపు రంగు అవెంజర్ 220 క్రూయిజ్ బైక్‌లు ఈ టాస్క్‌ఫోర్స్ కోసం ఎంపికయ్యాయి. ఎనిమిది గంటలపాటు నిరంతరాయంగా సంచరించినా డ్రైవర్ అలసిపోకుండా ఉండేలా ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. వీటిపై HCSC, సిటీ పోలీస్, ట్రాఫిక్ పోలీస్ లోగోలు ముద్రించారు. భవిష్యత్తులో మరో 100 వాహనాలను కొనుగోలు చేయనున్నారు. ఈ టాస్క్‌ఫోర్స్ ప్రధానంగా జంక్షన్ల మధ్య ట్రాఫిక్ జామ్‌లను నివారించడం, అక్రమ పార్కింగ్ తొలగించడం, రోడ్లపై ఉన్న అడ్డంకులను క్లియర్ చేయడం, ప్రమాదాల సమయంలో వెంటనే స్పందించడం, అలాగే బ్రేక్‌డౌన్ వాహనాలను గుర్తించి తొలగించడం వంటి పనులు చేస్తుంది.

దీనికోసం మూడు అధునాతన క్రేన్లు కూడా సిద్ధంగా ఉంచబడ్డాయి. ఈ కొత్త టాస్క్‌ఫోర్స్ వాహనాలు రోడ్లపై ట్రాఫిక్ నియంత్రణను మరింత వేగవంతం చేస్తాయని, అత్యవసర పరిస్థితుల్లో పోలీసులు మరింత సమర్థవంతంగా స్పందించగలరని అధికారులు చెబుతున్నారు. దీంతో హైదరాబాద్‌లో ట్రాఫిక్ నిర్వహణ ఒక కొత్త దశలోకి అడుగుపెట్టింది.

Telangana Secretariat : బీజేపీ శ్రేణులను అడ్డుకుని అరెస్ట్ చేసిన పోలీసులు

Exit mobile version